రాష్ట్రంలోని గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ నేడు విడుదల కానుంది.కీతోపాటు అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో టీఎస్‌పీఎస్సీ అందుబాటులో ఉంచనున్నారు.
ఐదు రోజులపాటు అభ్యంతరాలకు గడువు ఇవ్వనుంది.ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాకుంటే రెండు, మూడు రోజుల్లో ఫైనల్ కీ ని ప్రకటించనుంది.
అనంతరం 503 పోస్టుల్లో ఒక్కో ఉద్యోగానికి 50 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు.అంటే మొత్తం 25,150 మంది గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అర్హత సాధిస్తారు.
మొత్తం 503 గ్రూప్-1 పోస్టులకు ఈ నెల 16న ప్రిలిమినరీ పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది.దీనికి 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు.
ఈ పరీక్షలో టీఎస్‌పీఎస్సీ తొలిసారి ఒక్కో అభ్యర్థికి ఒక్కో నంబర్ సిరీస్‌తో ప్రశ్నాపత్రం ఇచ్చింది.ప్రశ్నలు అవే ఉన్నప్పటికీ జంబ్లింగ్ పద్ధతిలో జవాబులు అడిగారు.
ప్రతిఒక్కరికీ ఒక్కో ‘కీ’ ఇవ్వడం సాధ్యం కానందున మాస్టర్ క్వశ్చన్ పేపర్ ‘కీ’ విడుదల చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.అర్హత సాధించిన అభ్యర్థులకు వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో మెయిన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.