రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు పెద్ద చిక్కొచ్చిపడింది.వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చే విషయంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
తన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ, బలమైన పార్టీలను సైతం ఓటమి చెందేలా, తాను వ్యూహం అందిస్తున్న పార్టీకి అఖండ మెజారిటీని తీసుకురావడం లో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు.ఎన్నో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకు దక్కుతుంది.ఇక ఏపీలో అధికార పార్టీ గా ఉన్న వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఆయన పనిచేస్తున్నారు.2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలను అమలు చేయడం వల్లే వైసీపీ కి 151 సీట్లు దక్కాయి.అదేవిధంగా 2024 ఎన్నికల్లోనూ వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చే బరువు బాధ్యతలను జగన్ ప్రశాంత్ కిషోర్ పై పెట్టారు.
ఈ మేరక పికే కి చెందిన ఐ ప్యాక్ టీం కూడా రంగంలోకి దిగి , వివిధ నియోజకవర్గాల్లో సర్వేలు చేపడుతోంది.
కాకపోతే 2019 మాదిరిగా 2024 ఎన్నికలు వైసీపీ కి అంత సానుకూలంగా ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.ఎందుకంటే పెద్దఎత్తున ఏపీలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తున్నా, అభివృద్ధి పరంగా చూసుకుంటే వెనుకబడిందని చెప్పాలి.ఈ విషయంలో ప్రజల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది.2019 ఎన్నికల్లో జగన్ పరిస్థితి వేరు.అప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉండడంతో అధికారపార్టీ తప్పిదాలను హైలెట్ చేస్తూ విమర్శలు చేసే వారు.అలాగే పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యేందుకు అవకాశం ఏర్పడింది.

అలాగే టీడీపీ ప్రభుత్వం పై జనాలలోను తీవ్ర వ్యతిరేకత పెరగడం ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి.కానీ 2024 ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో సహజం గానే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది.దీనికి తోడు జనసేన , టీడీపీ వామపక్ష పార్టీలు పొత్తు పెట్టుకునే ఆలోచనలు ఉన్నాయి.
దీంతో ఓట్ల చీలిక తప్పని సరిగా ఉంటుంది .కాకపోతే కొన్ని సామాజిక వర్గలను పూర్తిగా తమవైపు వైసీపీ తిప్పుకోగలిగితేనే విజయావకాశాలు మెండుగా ఉంటాయి.ఈ విషయంలో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చ గలిగితేనే వైసీపీకి మళ్లీ అధికారం దక్కించు కునేందుకు అవకాశం ఏర్పడుతుంది.ఇప్పుడు ఇదే పేకే కు అతి పెద్ద సవాలు గా మారింది.