జపాన్ కు చెందిన కవసాకీ హెవీ ఇండస్ట్రీస్ కంపెనీ తయారు చేయనిదంటూ ఏదీ లేదనే చెప్పాలి.ఇది బైక్స్ నుంచి షిప్స్ వరకు ఎన్నో రకాల వాహనాలను తయారు చేస్తుంది.
అంతేకాదు ఈ కంపెనీ ఇండస్ట్రియల్ రోబోలు, గ్యాస్ టర్బైన్, బాయిలర్స్ కూడా తయారు చేస్తోంది.అయితే తాజాగా అది తయారు చేసిన ఒక కొత్త రోబో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచంలో మొట్ట మొదటి రోబో మేకను తయారు చేసిన కంపెనీగా కవసాకీ రికార్డు సృష్టించింది.కవసాకీ ఈ రోబోకి ముద్దుగా బెక్స్ అని పేరు పెట్టింది.
అయితే దీని ప్రత్యేకత ఏంటంటే, మనుషులు బెక్స్ రోబోపై ఎక్కి కూర్చొని రైడింగ్ చేయొచ్చు.గతంలో అందుబాటులోకి వచ్చిన డాగ్ రోబో, హ్యూమన్ రోబోలకు ఈ ఫెసిలిటీ లేదు.
సరికొత్త మేక రోబో తనంతట తానే నడవగలదు, కూర్చోగలదు.అంతేకాదు అది నిజమైన మేక లాగానే లేచి మనుషులను ఎక్కించుకొని వారిని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లకలదు.100 కిలోల వరకు బరువున్న మనుషులు, వస్తువులను ఇది మోయగలదు.ఒక మనిషిని మాత్రమే కాదు ఫ్యాక్టరీలలోని వస్తువులను కూడా ఇది క్యారీ చేస్తూ వెళ్లగలదు.
అందుకే దీనిని గోడౌన్లలో కూడా ఉపయోగించవచ్చు.అయితే రైడింగ్ చేసేవారి కోసం ఒక హ్యాండిల్ బార్ ను మేక మెడ భాగంలో అమర్చారు.
సరికొత్త మేక రోబోను తయారు చేయడానికి టోక్యో యూనివర్సిటీతో కలిసి పనిచేసింది కవసాకీ.ఈ రోబో పనితీరుకు సంబంధించిన వీడియోని యూట్యూబ్ లో షేర్ చేశారు.
ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.వైరల్ వీడియోలో ఒక వైట్ రోబో మేక తనంతట తానే ముందుకు నడుస్తూ కనిపించడం చూడొచ్చు.
ఆపై ఇది మోకాళ్ళపై కూర్చుని ఎటంటే అటు తిరుగుతూ తన టార్గెట్ ప్లేస్ కి వెళ్లి కూర్చుంది.అనంతరం ఒక యువతిని ఎక్కించుకొని అది అటు ఇటు తిరుగుతూ ఆశ్చర్యపరిచింది.
టోక్యోలోని ఇంటర్నేషనల్ రోబో ఎగ్జిబిషన్ ఈ రోబో పర్ఫామెన్స్ చేసింది.ఈ వీడియో చూసి అద్భుతం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మీరు కూడా దీనిని చూసేయండి.