సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారు.అందుకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారు.
మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్, నిన్న కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ కావడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్లయింది.జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అందుకు తగ్గట్టుగానే తన అధికార బలంతో బీజేపీపై దాడి ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలతో కేసీఆర్ వరుస భేటీ అవుతున్నారు.
ఇటీవల తమిళనాడు వెళ్లి సీఎం స్టాలిన్‌ను కలిశారు.దీంతో బీజేపీ వ్యతిరేక కూటమి కోసమేనన్న ప్రచారం సాగింది.
తాజాగా ప్రగతి భవన్ వేదికగా వామపపక్ష పార్టీలతో కేసీఆర్ భేటీ అయ్యారు.జాతీయ రాజకీయాలపై సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కేరళ సీఎం విజయన్‌తో సుధీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని.అందుకు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లాలని సమాలోచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
అయితే వీరితో కాంగ్రెస్ పార్టీ కలసి వస్తుందో లేదో చూడాలి.ఒకవేళ జాతీయ రాజకీయాల్లో కలిసి వచ్చినా… రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదు.
ఇక్కడ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ ఉప్పునిప్పులా ఉన్నాయి.
తెలంగాణలో కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్ వైపే మొగ్గుచూపే అవకాశం ఉంది.ఇటీవల జరిగిన మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు గులాబీ పార్టీకే మద్దతు తెలిపాయి.మొత్తంగా చూస్తే.
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్రవేయడానికి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది.కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బలం పుంజుకోకపోవడం కేసీఆర్‌కు కలిసివచ్చే అంశం.
రానున్న రోజుల్లో కేసీఆర్ జాతీయ స్థాయిలో ఏయే పార్టీ నేతలతో భేటీ అవుతారో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కేసీఆర్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ వేస్తారనేది చూడాలి.