కోవిడ్ కారణంగా ఆస్ట్రేలియా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.దాదాపు మూడు నెలల నుంచి వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండటంతో దేశంలోని కీలక నగరాల్లో లాక్‌డౌన్ అమలవుతోంది.
అయితే స్వేచ్ఛా ప్రియులైన ఆస్ట్రేలియన్లు లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు రోడ్డెక్కిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే టీకా టార్గెట్‌ను చేరుకోవడంతో దాదాపు 107 రోజుల పాటు నిరంతరాయంగా కొనసాగిన లాక్‌డౌన్ నుంచి సిడ్నీ వాసులకు గత సోమవారం విముక్తి కలిగింది.
ప్రభుత్వ నిర్ణయంతో పబ్‌లు, రెస్టారెంట్లు, దుకాణాలు సైతం తిరిగి కార్యకలాపాలను ప్రారంభించాయి.ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్లుగా ప్రజలు రోడ్లపైకి రావడంతో సిడ్నీలో సోమవారం సందడి వాతావరణం నెలకొంది.బస్సులు, రైళ్లు, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలలో జనం కిక్కిరిసి వుండటం, వ్యాపార సముదాయాల్లో రద్దీ, పిల్లలు పాఠశాలలకు వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సిడ్నీలో పరిస్ధితిని తెలియజేస్తున్నాయి.ఇదే సమయంలో ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.
వ్యాక్సినేషన్ శాతం పెరగడంతో కోవిడ్ ఆంక్షలను మరింత సడలించింది.దీనిలో భాగంగా 16 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇకపై కార్యాలయాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి కాదు.
అలాగే ఎక్కువ మంది ప్రజలు ఇళ్లలో, ఆరుబయట గుమిగూడటానికి అనుమతిస్తూ న్యూసౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలు… రానున్న కాలంలో కోవిడ్ వైరస్‌తో సహ జీవనం చేసేందుకు వీలుగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయి.అయితే ఈ చర్యలు కోవిడ్ తీవ్రతను మరింత పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆంక్షల సడలింపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ.
న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ డొమినిక్ పెరోట్టెట్ మాట్లాడుతూ.ఇది అంతం కాదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం వెసులుబాటు కల్పించినవి కాకుండా మిగిలిన కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అలాగే రిటైల్ షాపులు, పబ్‌లు, జిమ్‌లకు వ్యాక్సినేషన్ పొందిన వారిని ఎక్కువ సంఖ్యలో అనుమతిస్తామని ప్రీమియర్ వెల్లడించారు.
వివాహాలకు సైతం అతిథులను ఆహ్వానించడంపై ఎలాంటి పరిమితులు లేవని.కానీ అందరూ తప్పనిసరిగా సామాజిక దూరాన్ని పాటించాలని ఆయన సూచించారు.కాగా.న్యూసౌత్ వేల్స్ రాష్ట్రంలో సోమవారం కొత్తగా 265 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇది గడిచిన 10 వారాల కనిష్టం.సెప్టెంబర్ మొదటివారంలో ఒక్కరోజులో అత్యధికంగా 1,599 కరోనా కేసులు నమోదయ్యాయి.