కోవిషీల్డ్ విషయంలో భారత్- బ్రిటన్‌ల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇండియా కౌంటర్ యాక్షన్‌కి యూకే దిగి వచ్చింది.
భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్ తెలిపింది.భారత ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేషన్‌ను గుర్తించడానికి చర్చలు జరుగుతున్నాయని వివరించింది.
సాంకేతికపరమైన సమన్వయం కోసం భారత ప్రభుత్వంతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నామని బ్రిటీష్ హైకమిషన్ వెల్లడించింది.తద్వారా భారత ప్రభుత్వం అందించిన టీకాలు వేసుకున్నవారి కొవిడ్ టీకా సర్టిఫికేషన్‌ను యూకే ప్రభుత్వం ఆమోదించడానికి వీలు చిక్కుతుందని వివరించింది.
కాగా, బ్రిటన్ ప్రభుత్వ కొత్త ట్రావెల్ రూల్స్ ప్రకారం.కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తి చేసుకున్న భారతీయులను యూకేలో టీకాలు వేయించుకోని వారిగానే పరిగణించబడతారని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాకుండా దేశంలో అడుగుపెట్టిన భారతీయులు తప్పనిసరిగా 10 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాలని తేల్చిచెప్పింది.దీంతో విషయం భారత ప్రభుత్వం వరకు వెళ్లింది.
ఈ వ్యవహారం రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైంది.
ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్వయంగా రంగంలోకి దిగారు.
పరస్పర ప్రయోజనాలతో ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని యూకేను కోరారు.భారత్ విజ్ఞప్తితో కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిని సైతం అనుమతిస్తున్నట్లు యూకే నిబంధనలు సవరించింది.
సవరించిన మార్గదర్శకాల ప్రకారం.ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్, ఆస్ట్రాజెనెకా వాక్సేవ్రియా, మోడరన్ టకేడా వంటి వ్యాక్సిన్లను లిస్ట్‌లో చేరుస్తున్నట్లు యూకే తెలిపింది.
కానీ ఇక్కడే బ్రిటన్ మెలిక పెట్టింది.కొవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులకు కూడా క్వారంటైన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది.
సమస్య కొవిషీల్డ్ కాదని, ఇండియాలోని వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్‌పై అనుమానాలే అసలు సమస్య అని చెప్పింది.
మరోవైపు కోవిషీల్డ్ వ్యవహారంలో తమను తీవ్రంగా ఇబ్బండి పెట్టిన బ్రిటన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది.భారత్‌లో అడుగుపెట్టిన బ్రిటన్ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3 సార్లు కొవిడ్ టెస్టులు వంటి ఆంక్షలు అమలు చేయనుంది.దీని ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్ పౌరులు 3 ఆర్‌టీ పీసీఆర్ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది.
ప్రయాణానికి 72 గంటల ముందు ఒకసారి, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది.భారత్‌కు చేరుకున్న తర్వాత ఇంటివద్ద/ హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి.
వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా బ్రిటన్ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.