తెలుగుదేశం పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఆ పార్టీ సీనియర్ నాయకుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.అధినేత చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు సీనియర్ నాయకులకు ఏమాత్రం రుచించడం లేదు.
పార్టీలో కొంత మంది నాయకులు తీరుతో డ్యామేజ్ జరుగుతున్నా, చంద్రబాబు వారిని మరింతగా ప్రోత్సహిస్తూ ఉండటం, ఇతర పార్టీల్లోని నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి కీలక పదవులు అప్పగించడం, మొదటి నుంచి ఉన్న వారికి పదవుల్లోనూ,, ప్రాధాన్యం లోనూ చోటు దక్కకపోవడం వంటి వాటితో చంద్రబాబుపై సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.అయితే పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు అన్నీ చంద్రబాబు తీసుకుంటారు.
బాబు నిర్ణయాలను తప్పుపట్టే అంత సాహసం ఎవరూ చేసే పరిస్థితి లేదు.
కానీ అలా చెప్పే ప్రయత్నం చేసినవారు, అసంతృప్తితో వెలిగిన వారు ఇప్పటికే పార్టీకి దూరమయ్యారు.
ఇక ఎన్టీఆర్ హయాం నుంచి టిడిపిలోనే కొనసాగుతున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అనంతపురం జిల్లాకు చెందిన జేసీ బ్రదర్స్ వంటివారి చంద్రబాబు నిర్ణయం తప్పుపడుతూ, పార్టీలో చోటుచేసుకుంటున్న లోపాలను ఎత్తి చూపిస్తూ, అధినేతకు చురకలు అంటిస్తూ ఉంటారు.టిడిపి ప్రభుత్వ హయాంలో వైసీపీ లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి తీసుకోవడమే కాకుండా వారిలో చాలామందికి మంత్రి పదవులు కట్టబెట్టడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ఈ విషయంలో వైసీపీ విమర్శలు సర్వసాధారణమే అయినా, టిడిపి కేడర్ లో బాబు నిర్ణయం పై అసంతృప్తి ఉంది.మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా వలస వచ్చిన నాయకులకు కీలక పదవులను కట్టబెట్టడం పై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.కానీ అధినేతకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేయలేకపోయారు.ఈ మధ్యనే పార్టీ విధానాలపై గోరంట్ల బుచ్చయ్య వంటివారు ఈ అంశాన్ని ప్రస్తావించారు.ఇక పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదని , ఎవరూ గెలిచే పరిస్థితి లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వంటివారు మీడియా ముందే ఈ విషయాన్ని చెప్పారు .ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి లను నియమించడంతో పాటు , ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటి నుంచే ఎంపిక చేయాలని చూస్తుండడంతో, వలస నేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మొదటి నుంచి పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడిన వారికే అవకాశం కల్పించాలని అధినేత చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు.దీంతో టిడిపిలో వలస నేతలకు డోర్ క్లోజ్ అవుతాయని ఇప్పటికే పార్టీలో వలస వచ్చిన నేతలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదనే అంచనాలో టిడిపి నాయకులు ఉన్నారు.