తగ్గిందనుకున్న కరోనా మహమ్మారి మరోసారి పడగ విప్పడంతో ప్రపంచంలోని పలు దేశాలు అల్లాడిపోతున్నాయి.ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఇరాన్, బ్రెజిల్, ఆస్ట్రేలియాలలో పరిస్ధితులు దారుణంగా వున్నాయి.
దీంతో వైరస్‌ను కట్టడి చేసేందుకు కొన్ని చోట్ల పాక్షికంగా, మరికొన్ని చోట్ల పూర్తిగా లాక్‌డౌన్ విధించారు.ఇక తొలి విడత కరోనా మహమ్మారిని అద్భుతంగా నిలువరించి ప్రపంచ దేశాల మన్ననలు పొందిన న్యూజిలాండ్‌లో తాజాగా వైరస్ అడుగుపెట్టింది.
దాదాపు ఆరు నెలల తర్వాత అక్కడ తొలి కరోనా కేసు నమోదైంది.ఆక్లాండ్ నగరంలోని ఓ 58 ఏళ్ల వ్యక్తిలో డెల్టా వేరియంట్ ను గుర్తించారు.
ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.అలాగే వైరస్ వెలుగుచూసిన ఆక్లాండ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించారు.
ఈ కేసును డెల్టా వేరియంట్‌గా అనుమానిస్తున్నారు.గత ఆరు నెలలుగా ఒక్క కరోనా కేసు నమోదు కానప్పటికీ.డెల్టా వేరియంట్ నేపథ్యంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదని ప్రధాని అన్నారు.తక్షణమే మనం స్పందించని పక్షంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని.
ఇతర దేశాలను చూసి తెలుసుకోవచ్చని జెసిండా చెప్పారు.
డెల్టా వేరియంట్ బారిన పడకుండా ఉండేందుకు కేవలం ఒక్క ఛాన్స్ మాత్రమే ఉంటుందని ప్రధాని తెలిపారు.
డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని చెబుతూ.దీని వల్ల ప్రస్తుతం ఆస్ట్రేలియా పడుతున్న ఇబ్బందులను ఆమె ఉదహరించారు.
కఠినమైన నిర్ణయాలను తీసుకోవడం వల్లే కరోనాను న్యూజిలాండ్ కట్టడి చేయగలిగిందని జెసిండా గుర్తుచేశారు.ప్రారంభంలోనే లాక్ డౌన్ విధించడం వల్ల కొన్ని రోజులు మాత్రమే మనకు ఇబ్బంది ఉంటుందని.
అలసత్యం ప్రదర్శించి, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటే నెలల తరబడి లాక్ డౌన్ లో ఉండాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.కాగా, కరోనా కట్టడి విషయంలో న్యూజిలాండ్ ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంది.
దాదాపు 50 లక్షల జనాభా ఉన్న ఆ దేశంలో ఇప్పటి వరకు కరోనా వల్ల కేవలం 26 మంది మాత్రమే చనిపోయారంటే అక్కడి యంత్రాంగం ఎలా పనిచేసిందో అర్ధం చేసుకోవచ్చు.