రాయ్ లీ ( Roy Lee )అనే కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి చేసిన పని ఇప్పుడు టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది.అతను సొంతంగా “ఇంటర్వ్యూ కోడర్” అనే ఒక AI టూల్‌ని తయారు చేశాడు.
ఈ టూల్ ఏం చేస్తుందంటే, లీట్‌కోడ్ తరహా కోడింగ్ సమస్యల్ని ఇట్టే పరిష్కరిస్తుంది.దీన్ని ఉపయోగించి అతను అమెజాన్, మెటా( Amazon, Meta ) (ఫేస్‌బుక్), టిక్‌టాక్, క్యాపిటల్ వన్ లాంటి పెద్ద కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ ఆఫర్లు కొట్టేశాడట.
సోషల్ మీడియాలో లీనే స్వయంగా ఈ విషయం చెప్పాడు.చాలా కంపెనీల ఇంటర్వ్యూలు ఈ టూల్‌తోనే పాసయ్యానని, అమెజాన్ ఆఫర్ కూడా ఇలాగే వచ్చిందని ఓపెన్‌గా చెప్పేశాడు.
అంతేకాదు, ఇంతకుముందు లీ లీట్‌కోడ్ సమస్యల్ని ఎలా పరిష్కరించాలో నేర్పిస్తూ ఒక అకౌంట్ కూడా నడిపేవాడు.
తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో ఏకంగా మెటా, టిక్‌టాక్, అమెజాన్, క్యాపిటల్ వన్ కంపెనీల నుంచి వచ్చిన ఇంటర్న్‌షిప్ ఆఫర్ల స్క్రీన్‌షాట్‌లను( Screenshots of internship offers) పెట్టాడు.అన్నీ ఫిబ్రవరి 2025లో మొదలయ్యేవే.ఒకవేళ మిగతా కంపెనీలు ఆఫర్లు వెనక్కి తీసుకుంటే, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటానని కూడా రాసుకొచ్చాడు.
తన టూల్ ఎంత పవర్‌ఫులో చూపించడానికి, యూట్యూబ్‌లో ఒక వీడియో కూడా పెట్టాడు లీ.అందులో అమెజాన్ కోడింగ్ ఇంటర్వ్యూని నిజంగా తీసుకుంటున్నట్టు నటిస్తూ, “ఇంటర్వ్యూ కోడర్” సహాయంతో ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశాడు.ఈ వీడియో వైరల్ అవ్వడంతో అమెజాన్ సీరియస్ అయింది.వెంటనే కొలంబియా యూనివర్సిటీకి కంప్లైంట్ మెయిల్ పెట్టింది.లీ తమ ఇంటర్వ్యూలో ఒక చీటింగ్ టూల్‌ని వాడి అన్యాయంగా గెలిచాడని, అది కనిపించని టూల్ అని మెయిల్‌లో పేర్కొంది.అంతేకాదు, లీ ఆ టూల్‌ని అమ్మేస్తున్నాడని, చాలామంది మోసం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా చెప్పింది.
దీనిపై లీ స్పందిస్తూ, అమెజాన్ ఆఫర్‌ని తాను ముందే రిజెక్ట్ చేశానని, అక్కడ పనిచేయడానికి తనకు ఏమాత్రం ఆసక్తి లేదని తేల్చి చెప్పాడు.తన అసలు ఉద్దేశం ఈ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయడం కాదని, లీట్‌కోడ్ తరహా ఇంటర్వ్యూలు ఎంత వరస్ట్ గా ఉన్నాయో బయటపెట్టడమే అని అన్నాడు.ఈ వివాదం తర్వాత, మెటా తన ఇంటర్న్‌షిప్ ఆఫర్‌ని క్యాన్సిల్ చేసినట్టు ఒక మెయిల్ పంపిందట.ఆ మెయిల్ స్క్రీన్‌షాట్‌ని కూడా లీ షేర్ చేశాడు.మెటాతో ఫోన్ కాల్ తర్వాత వెంటనే తన ఉద్యోగం రద్దు అయిందని మెయిల్‌లో ఉంది.లీ చేసిన ఈ పని ఇప్పుడు కోడింగ్ ఇంటర్వ్యూల ఫెయిర్‌నెస్ గురించి, AIని ఉద్యోగ నియామకాల్లో వాడటం ఎంతవరకు కరెక్ట్ అనే విషయాలపై పెద్ద చర్చకు దారితీసింది.