కాపులను బీసీల్లో చేర్చాలని టిడిపి ప్రభుత్వంలో పెద్ద పెద్ద యుద్ధమే చేపట్టారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.2014 ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేరుస్తాం అంటూ తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీ ఇవ్వడంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేయడం, అది రాష్ట్ర సమస్యగా మారిపోవడం కాపులంతా రోడ్డెక్కి మరి తమ రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆందోళన నిర్వహించడం, తూర్పు గోదావరి జిల్లా తునిలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, అదే సమయంలో ఆందోళనకారులు రైలును దహనం చేయడం , ఇలా ఎన్నో సంచలన సంఘటనలు చోటు చేసుకున్నాయి.అయినా టిడిపి ఈ రిజర్వేషన్ అంశం లో తమ అభిప్రాయం ఏమిటో చెప్పకుండా ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది.ఆ వ్యవహారం అప్పట్లో ఉధృతంగా సాగి… సైలెంట్ అయ్యింది.
2019 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసిపి అధికారంలోకి వచ్చినా, ఈ ఉద్యమం విషయంలో పోరాటం చేసేందుకు అవకాశం ఏర్పడలేదు.ఎన్నికలకు ముందే ముద్రగడ పద్మనాభం సొంత ప్రాంతం లోనే కాపులను బీసీల్లో చేరుస్తానని తాను చంద్రబాబు మాదిరిగా మోసం చేయాలేను అని, ఇది కేంద్ర పరిధిలోని అంశం అని, కేంద్రం ఈ రిజర్వేషన్ విషయంలో సానుకూలంగా ఉంటే తాము మద్దతు ఇస్తామని జగన్ ప్రకటించారు.
అయినా జగన్ కు కాపులు మద్దతు పలకడంతో జగన్ ఈ విషయంలో నిలదీసేందుకు అవకాశం ఏర్పడలేదు.ఆ తర్వాత పరిణామాల క్రమంలో తాను కాపు రిజర్వేషన్ పోరాటం నుంచి తప్పుకుంటాను అని ముద్రగడ సంచలన ప్రకటన చేశారు.
అప్పటి నుంచి ఆయన సైలెంట్ గా ఉండి పోతున్నారు.ఆయన జనసేన ,బిజెపి, వైసిపీ లలో ఒక పార్టీలో చేరబోతున్నారని ప్రచారం గట్టిగా జరిగింది.దీనికి తగ్గట్టుగానే ఈ మూడు పార్టీలకు చెందిన నాయకులు మంతనాలు చేశారు.అయినా ఆయన రాజకీయంగా సైలెంట్ గానే ఉంటున్నారు.
అసలు పూర్తిగా రాజకీయాలకు ఆయన స్వస్తి పలికారా లేక సరైన సమయంలో , ఏదైనా పార్టీలో చేరాలనుకుంటున్నారా ? అసలు ఆయన మనసులో ఏముంది అనేది తెలీయక రాజకీయ పార్టీలతో పాటు, ముద్రగడ అనుచరులు ఉత్కంఠగా ముద్రగడ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.ముద్రగడ చేర్చుకోవడం ద్వారా కాపుల నుంచి ఎంతో కొంత మద్దతు ఉంటుందనేది అన్ని పార్టీల అంచనా.కానీ ముద్రగడ మాత్రం తన మనసులో మాట బయట పెట్టడం లేదు.