రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుని, ఆ పార్టీకి చెందిన దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని కాంగ్రెస్ ను పూర్తిగా బలహీనం చేయడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది.కాంగ్రెస్ తెలంగాణలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత, కాంగ్రెస్ కేడర్ లో ఆశలు చిగురిస్తున్నాయి.రేవంత్ నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని నమ్మే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
దీంతో పాటు, బీజేపీ లో చేరిన చాలామందికి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది.పార్టీ గుర్తు మీద గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు.
తమ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ లో చేరడాన్ని రేవంత్ తప్పుబడుతున్నారు.దీనిపై అప్పట్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్పందించినా, మిగిలిన వారంతా సైలెంట్ అయిపోయారు.
అయితే కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇప్పటికీ కాంగ్రెస్ కు ఆదరణ ఉంది అనే విషయాన్ని గుర్తించారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలు పక్కనపెట్టి, ఆ నియోజకవర్గంలో నాయకులను ప్రోత్సహించాలని, పార్టీ క్యాడర్ ను తిరిగి యాక్టివ్ చేయడం ద్వారా, రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ కాంగ్రెస్ కు అవకాశం దక్కేలా చేయాలని అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ప్లాన్లు వేస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో ఆందోళన పుట్టిస్తున్నాయి.ఇప్పటికే తాము సొంతగూటికి వచ్చేందుకు సిద్ధం అన్నట్లుగా కొంతమంది ఎమ్మెల్యేలు రాయబారాలు నడుపుతున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా రేవంత్ సిఫార్స్ తో కాంగ్రెస్ లో టికెట్ దక్కించుకుని గెలిచినవారు, ఇప్పుడు మళ్లీ ఆయన పిసిసి అధ్యక్షుడు కావడంతో వెనక్కి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట.

ముఖ్యంగా ఖమ్మం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఇప్పటికే రేవంత్ తో రాయబారాలు నడుపుతున్నట్లు సమాచారం.అలాగే మిగిలిన ఎమ్మెల్యేల్లో కొంతమంది వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా సంకేతాలు పంపిస్తున్నారట.పార్టీ నుంచి వెళ్లిన వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ఘర్ వాపసీ కార్యక్రమం చేపట్టడం, టిఆర్ఎస్ లో నెలకొన్న పరిణామాలు కాంగ్రెస్ భవిష్యత్తు పై చిగురిస్తున్న ఆశలు, ఇలా ఎన్నో అంశాలతో వారు వెనక్కు వచ్చేందుకు కారణం అవుతున్నాయట.
అయితే అలా వెనక్కి వచ్చిన వారిని వచ్చినట్లు కాంగ్రెస్ లోకి ఆహ్వానించడం కంటే, కొత్తగా దీనిపై ఒక కమిటీ వేసి, అక్కడ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని రేవంత్ ప్లాన్ వేస్తున్నారట.