అమెరికా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జూలై 4న ఆ దేశ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.గతేడాది కోవిడ్ కారణంగా ఇళ్లకే పరిమితమైన అమెరికన్లు ఈసారి మాత్రం ఇండిపెండెన్స్ డేను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవంతో పాటు కోవిడ్ విముక్త దినోత్సవం కూడా ఒకే రోజున జరుపుకోవాలని అమెరికా అధ్యక్షుడు భావించారు.అందుకు తగినట్లుగానే ఆయన వ్యాక్సినేషన్‌ను పరుగులు పెట్టించి దేశాన్ని మహమ్మారి నుంచి బయటపడేసేందుకు తీవ్రంగా శ్రమించారు.
అనుకున్నదాని ప్రకారం కాకపోయినా అగ్రరాజ్యం కేసుల నుంచి బాగానే బయటపడింది.
కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పలువురు భారత సంతతి వ్యక్తులు మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా వున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఆల్టోస్ హిల్స్‌కు మేయర్‌గా వ్యవహరిస్తున్న భారత సంతతికి చెందిన కవితా టంఖా పట్టణంలో ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్ల ర్యాలీకి కవిత నాయకత్వం వహించారు.
గతేడాది కోవిడ్ 19 కారణంగా విధించిన ఆంక్షల వల్ల నగరంలో పరిమిత స్థాయిలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి.కానీ ఈ ఏడాది మాత్రం జనం ఉత్సాహంగా బయటకు వచ్చారు.
తమ పాత కాలం నాటి వాహనాలతో కార్ల ర్యాలీలో పాల్గొన్నారు.అలాగే పిల్లలతో కలిసి అమెరికా జాతీయ పతకాలు చేతపట్టుకుని రోడ్డుకు ఇరువైపులా నిల్చొని సందడి చేశారు.
ఇది తమకు మొదటి పెద్ద పండుగ అని కవిత మీడియాతో అన్నారు.కోవిడ్ తర్వాత ఇది సరికొత్త ప్రారంభంగా ఆమె అభివర్ణించారు.
ఇది విపత్కర కాలమే అయినప్పటికీ.ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కవిత చెప్పారు.తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు తీసుకురావడం ఎంతో బాగుందని ఆమె అన్నారు.
53 ఏళ్ల కవిత టంఖా లాస్ ఆల్టోస్ హిల్స్‌లో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు.2018లో లాస్ ఆల్టోస్ హిల్స్ సిటీ కౌన్సిల్ స్థానానికి ఎన్నికయ్యే ముందు దాదాపు 8 సంవత్సరాల పాటు లాస్ ఆల్టోస్ హిల్స్ ప్లానింగ్ కమీషన్లో పనిచేశారు.ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, ఎల్ఎల్బీ డిగ్రీ పొందిన కవిత.అనంతరం చికాగోలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా నుంచి ఎల్ఎల్ఎం పట్టా పొందారు.15 ఏళ్ల పాటు ఆమె ప్రపంచంలోని అతి పెద్ద లా కంపెనీలలో న్యాయవాదిగా విధులు నిర్వర్తించారు.యూఎస్, ఇండియా వారసత్వంపై తాను గర్వపడుతున్నానని ఆమె అన్నారు.మనమంతా వేరు వేరు ప్రదేశాల నుంచి ఎన్నో కలలతో ఇక్కడికి వచ్చామని కవిత తెలిపారు.
డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కవితా టంఖా నేషనల్ ఫైనాన్స్ కమిటీ, హిల్లరీ ఫర్ అమెరికా వంటి కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు.అలాగే లాస్ ఆల్టోస్ హిల్స్‌లోని తన ఇంట్లో ఎన్నికైన వారికి ఆతిథ్యం ఇచ్చారు.
వీరిలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, అమీ బేరాలు వున్నారు.

ప్రతి నగరానికి సవాళ్లు వున్నట్లే.లాస్ ఆల్టోస్ హిల్స్‌కు కూడా వున్నాయని కోవిడ్‌తో ఎన్నో మార్పులు వచ్చాయని కవిత అన్నారు.అండర్ గ్రౌండ్ యుటిలిటీతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో బ్రాడ్ బ్యాండ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
దీనితోపాటు బాటసారుల కోసం ఓ మార్గాన్ని నిర్వహించేందుకు కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నారు.దీనితో పాటు ఈ ప్రాంతంలో త్వరలో కార్చిచ్చులు ప్రారంభమవుతాయని తెలిపారు.లాస్ ఆల్టోస్ హిల్స్‌కు కేవలం ఐదు మైళ్ల దూరంలోనే గతేడాది మంటలు చెలరేగిన విషయాన్ని కవిత గుర్తుచేస్తున్నారు.దీనిని అరికట్టేందుకు.
ప్రతికూల పరిస్ధితుల్లో స్పందించే చర్యలపై దృష్టి పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు.