హమ్మయ్య కేంద్ర అధికార పార్టీ లోకి వచ్చేసాం, ఇక తమకు ఏ కేసుల భయం ఉండదని, తమ రాజకీయ భవిష్యత్తుకు ఏ ఢోకా ఉండదని ఊహించుకుంటూ, ఎన్నో ఆశలతో తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి పెద్దఎత్తున నాయకులు చేరారు.చేరిన మొదట్లో వీరికి తగిన ప్రాధాన్యం లభించింది.
త్వరలో పార్టీ పదవులు తమకు దక్కుతాయని, అనేక నామినేటెడ్ పోస్టులను తమకు కేటాయిస్తారని, ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు టీడీపీ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నారు.
వీర్రాజు కరుడుగట్టిన బీజేపీ వాదిగా పేరు ఉంది.
దానికి తగ్గట్టుగానే ఆయన టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన నాయకుల విషయంలో అంతగా సఖ్యత లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు.టీడీపీ నుంచి వచ్చిన వారంతా, కేవలం వైసీపీ ప్రభుత్వం కేసుల్లో ఇరికిస్తుందేమో అనే భయం, వివిధ కారణాలతో బీజేపీ లోకి వచ్చి చేరారు.
కానీ వీరంతా ఎప్పుడైనా మళ్ళీ టీడీపీ లోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు అనేది వీర్రాజు అభిప్రాయం.అందుకే వీరి విషయంలో అంతగా ప్రాధాన్యం ఇవ్వనట్టుగానే వ్యవహరిస్తున్నారు.
దీనికి తగ్గట్టు కొత్తగా తన టీమ్ ను ఏర్పాటు చేసుకున్నా, ఆ టీమ్ లో మొదటి నుంచి బీజేపీతో ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ, పదవులు కేటాయించారు.

కానీ టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరిన ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వక పోవడం వెనుక కారణం కూడా ఇదే అని తెలుస్తోంది.విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ మాధవ్ వంటి వారు మాత్రమే జనాల్లో కాస్త పలుకుబడి ఉన్నవారు.మిగతావారంతా పెద్దగా గుర్తింపు లేని నాయకులే.
లంకా దినకర్, ఆదినారాయణరెడ్డి గోనుగుంట్ల సూర్యనారాయణ, యామిని ఇలా ఎంతో మంది టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చి చేరారు.వారెవరికీ ఇప్పుడు వీర్రాజు కమిటీలో స్థానం దక్కలేదు.
దీంతో టీడీపీ మాజీలంతా, తమకు ప్రాధాన్యత లేదని లబోదిబోమంటున్నారు.ఈ పరిస్థితుల్లో పార్టీ పై అసంతృప్తి వ్యక్తం చేసి బయటికి వెళ్దామన్నా, రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు.
ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులు అంతా కోవర్టులే అని వైసీపీ పదే పదే ప్రచారం చేస్తోంది.ఇది నిజమనే అభిప్రాయంలో సోము వీర్రాజు ఉండడంతో వీరందరినీ పక్కన పెట్టినట్టుగా, పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.