గత కొంతకాలంగా తెలంగాణలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో అధికార పార్టీ టిఆర్ఎస్ పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.ఒకవైపు ప్రజావ్యతిరేకత , మరోవైపు బీజేపీ తెలంగాణలో బాగా బలం పుంజుకోవడం ఇవన్నీ టిఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తూనే వస్తున్నాయి.
వరుసగా ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితుల నుంచి పార్టీని గట్టెక్కించేందుకు కేసీఆర్ ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు.కొద్ది రోజుల పాటు ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయి మరీ పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసే విషయంపై కేసీఆర దృష్టి పెట్టారు.
కేసీఆర్ ఫామ్ హౌస్ రాజకీయంపై రకరకాల అనుమానాలు అందరికీ వచ్చాయి.మార్చి లోపు కేటీఆర్ కు తెలంగాణ సీఎం గా బాధ్యతలు అప్పగించే విషయం పైన కెసిఆర్ దృష్టి సాధించారు.
అయితే దాని కంటే ముందుగానే తెలంగాణ మంత్రి మండలి లో పెద్ద ఎత్తున మార్పులు, చేర్పులు చేపట్టాలని, చురుకైన వారిని, సీనియర్ నాయకులను మంత్రిమండలిలోకి తీసుకుని బిజెపి దూకుడుకు చెక్ పెట్టాలని కెసిఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుత మంత్రులలో చాలామంది పని తీరు అంతంత మాత్రంగా ఉండడం, మరికొంతమంది పార్టీపై అసంతృప్తితో ఉండడం , అలాగే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రజలలో అపఖ్యాతి మూటగట్టుకుంటున్న కొంతమందిని గుర్తించిన కెసిఆర్ వారిని తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించి కొత్తవారిని నియమించేందుకు లిస్ట్ రెడీ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇటీవల నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలుపొందిన తన కుమార్తె కవితకు మంచి పోర్ట్ ఫోలియో ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రిమండలిలో మార్పుచేర్పులు చేపట్టేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.అలాగే సామాజిక వర్గాల సమతూకం కూడా పాటించాలని, ఎక్కడా బీజేపీకి అవకాశం దొరక్కుండా తెలంగాణలో మరో సారి టిఆర్ఎస్ జెండా ఎగురవేసి పూర్తిగా ప్రజా బలం పెంచుకునేందుకు కెసిఆర్ చూస్తున్నారు.ఇప్పటికే ప్రస్తుతం మంత్రుల పనితీరు పై కేసీఆర్ నివేదిక తెప్పించుకున్న నేపథ్యంలో, ఆ నివేదిక ఆధారంగానే మంత్రి మండలి లో మార్పులు చేర్పులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.