అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన కొలువులోనూ, దేశంలోని కీలక పదవుల్లోనూ భారతీయులకు పెద్ద పీట వేస్తున్న డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో ముగ్గురు భారతీయ అమెరికన్లకు ఉన్నత పదవులను కట్టబెట్టారు.తెలుగు మూలాలున్న ఇండియన్ అమెరికన్ సరితా కోమటిరెడ్డిని న్యూయార్క్ ఫెడరల్ కోర్టు జడ్జిగా ట్రంప్ ప్రతిపాదించారు.
ఇందుకు సంబంధించి ఆయన సెనేట్‌కు సిఫారసు చేశారు.సెనేట్ ఆమోదం లభించిన వెంటనే న్యూయార్క్ ఈస్టర్న్ జిల్లా కోర్టు జడ్జిగా సరిత బాధ్యతలు స్వీకరించనున్నారు.
తెలంగాణకు చెందిన డాక్టర్ దంపతులు హనుమంత్ రెడ్డి, గీతారెడ్డిల కుమార్తె సరితా కోమటిరెడ్డి.కొన్నేళ్ల క్రితమే వీరి కుటుంబం అమెరికాకు వలస వెళ్లి, మిస్సోరిలో స్థిరపడింది.హార్వర్డ్ యూనివర్సిటీ లా స్కూల్ నుంచి లా పట్టా పొందిన సరిత.జార్జి వాషింగ్టన్ వర్సిటీ, కొలంబియా యూనివర్సిటీల్లో విద్యా బోధన కూడా చేశారు.
ఇంటర్నేషనల్ నార్కోటిక్స్, మనీలాండరింగ్, హాకింగ్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ కో ఆర్డినేటర్‌గానూ సరిత పనిచేశారు.యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఫర్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ జడ్జి కావానా వద్ద ఆమె లా క్లర్క్‌గా కూడా పనిచేశారు.
ప్రస్తుతం న్యూయార్క్ తూర్పు జిల్లా అటార్నీ జనరల్ సాధారణ నేరాల విభాగానికి సరిత డిప్యూటీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు.

ఇక మరో భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖేల్ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా నియమించారు ట్రంప్.పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ధిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కు తన రాయబారికిగా భారతీయ అమెరికన్ మనీషా సింగ్‌ను ట్రంప్ నామినేట్ చేశారు.