ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా భయపెడుతున్న సంగతి తెలిసిందే.దీని కారణంగా మనుషుల మధ్య సామాజిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయి.
ముఖ్యంగా ప్రపంచం ఇంతగా కలవరపాటు గురయ్యేందుకు చైనానే కారణమంటూ చైనీయులపై పలు దేశాల్లో జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి.తాజాగా ఈ లిస్ట్‌లో భారతీయులు చేరారు.
ఇజ్రాయెల్‌లో భారత సంతతికి చెందిన ఓ యూదుడిని టైబెరియాస్ నగరంలో కరోనా కరోనా అంటూ చితకబాదారు.
మణిపూర్ లేదా మిజోరంలోని బ్నీ మెనాషే కమ్యూనిటికీ చెందిన అమ్ షాలెం సింగ్సన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడి పోరియా ఆసుపత్రిలో చేరాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితుడి వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఇజ్రాయెల్ టీవీ ఛానెల్ ఒకటి తెలిపింది.అతను చైనా జాతీయుడు కాదని, తాను అలాగే కరోనా బారినపడలేదని బాధితుడు వారికి వివరించేందుకు ప్రయత్నించాడని పోలీసులు వెల్లడించారు.
సింగ్సన్పై గత శనివారం దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

సింగ్సన్ తన కుటుంబంతో కలిసి మూడేళ్ల క్రితం భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు వలస వచ్చాడు.ఈ దాడి ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఎవ్వరూ లేరు.కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
టైబెరియాస్లో జరిగిన ఈ జాత్యహంకారదాడిని బ్నీ మెనాషే సమాజం తీవ్రంగా తప్పుబట్టింది.ఈ సమాజం ఇజ్రాయెల్‌కు వలస వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న షావే ఇజ్రాయెల్ ఛైర్మన్ మైఖేల్ ఫ్రాయిడ్ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.
ఈ ఘటనపై ఇజ్రాయెల్ పోలీసులు దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.