ప్రస్తుతం ఢిల్లీలో పౌరసత్వ చట్ట బిల్లు అమలు చేయకూడదంటూ నిరసన జ్వాలలు ఎగసి పడుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇందులో ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొంటూ పట్టణంలో అక్కడక్కడా నిరసనలు తెలుపుతున్నారు.
దీంతో నిరసన జ్వాలలు రోజురోజుకు ఎక్కువ అవుతుండడంతో సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోని కొన్ని మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు.దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందిస్తూ పలు భద్రతా చర్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

అయితే ఇది ఇలా ఉండగా ఢిల్లీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి ఎయిర్టెల్, వోడాఫోన్ సంస్థలకు సంబంధించిన ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి.దీంతో ఈ సంస్థలకు చెందిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే వాయిస్ కాలింగ్, మెసేజ్, డేటా సంబంధిత సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ఎయిర్టెల్ సంస్థ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది.అయితే ఏమైందో ఏమో కానీ వెనువెంటనే ఆ ట్వీట్లను తన ఖాతా నుంచి ఎయిర్టెల్ సంస్థ సంబంధిత అధికారులు తొలగించారు.
అంతేగాక ప్రస్తుతం నగరంలో కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారం తాత్కాలిక నిలిపివేత అమలు చేస్తున్నామని, నిషేధం పూర్తయిన తర్వాత ఎప్పటిలాగే తమ సేవలు కొనసాగుతాయని, ఈ అంతరాయనికి క్షమించాలని ఎయిర్టెల్ సంస్థ అధికారులు కోరుతున్నారు.
ఇదే తరహాలో మరో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ కూడా స్పందించింది.
తాత్కాలిక నిషేధం తర్వాత తమ సేవలను ఉపయోగించుకోవచ్చని తమ వినియోగ దారులకి తెలిపారు.