ప్రస్తుతం ఏపీలోని అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి.అధికారానికి దూరంగా ఉండడంతో పాటు తమ రాజకీయ భవిష్యత్తు మీద ఉన్న బెంగా, కేసుల భయం తదితర కారణాలతో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులంతా బిజెపిలో చేరేందుకు క్యూ కడుతున్నారు.
ఇక బీజేపీ కూడా స్థానికంగా బలపడాలంటే ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవాలని, ఈ సందర్భంగా ఎటువంటి నియమ నిబంధనలు విధించకుండా పార్టీలోకి తీసుకోవాలి అన్నట్టుగా కనిపిస్తోంది.ప్రస్తుతం బీజేపీలో చేరుతున్న నాయకుల బ్యాక్ గ్రౌండ్ పరిశీలిస్తే ఇదే అర్థం అవుతుంది.
ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలో చేరిపోయారు.వారిపై అనేక ఆర్థికపరమైన ఆరోపణలు ఉన్నాయి.
ఎన్నికల ముందు నుంచి వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆదాయపు పన్ను శాఖలు విచారణలు చేస్తూనే ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇంకా తాము టీడీపీనే అంటిపెట్టుకుని ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు తోపాటు వ్యక్తిగత భవిష్యత్తు కూడా దెబ్బతింటుందనే ఆలోచనతో వారంతా బిజెపిలోకి చేరిపోయారు.

ప్రస్తుతం బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ అనే కార్యక్రమానికి మరింత పదును పెట్టింది.దీంతో టిడిపికి చెందిన కీలక నాయకులంతా బిజెపి బాటపట్టారు.టిడిపి మాజీ మంత్రి శనక్కాయల అరుణ, పాతూరి నాగభూషణం, వాకటి నారాయణరెడ్డి, పూతలపట్టు రవి వంటి సీనియర్ నాయకులు ఉన్నారు.శనక్కాయల అరుణ గుంటూరులో ప్రముఖ వైద్యురాలిగా ఉన్నారు, టిడిపిలో మంత్రిగా పనిచేసిన ఆమె చాలా కాలంగా సైలెంట్ గానే ఉంటున్నారు, ఆమె కుమారుని రాజకీయాల్లోకి తీసుకొద్దామని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు, కానీ కొద్దిరోజుల కిందట 75 ఏళ్లు దాటిన వృద్ధ దంపతులకు హాస్పటల్లో ఐ వి ఎఫ్ ట్రీట్మెంట్ చేశారు.
ఇది ప్రపంచ రికార్డు అని అరుణ కు చెందిన హాస్పిటల్ ప్రకటించుకుంది అయితే ఇది ఇది మెడికల్ బోర్డు నిబంధనలు ఉల్లంగించడమే అంటూ ఆమెకు నోటీసులు అందాయి.దీనిపై ఏపీ ప్రభుత్వం కూడా విచారణ చేస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఆమె బిజెపిలో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇక గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణం పరిస్థితి కూడా దాదాపు ఇంతే.చాలాకాలం నుంచి టీడీపీనే అంటిపెట్టుకుని ఉన్న నాగభూషణంకు కృష్ణా నది కరకట్ట మీద ఐదెకరాల స్థలంతో పాటు అందులో లో ఇల్లు కూడా ఉంది.దీనిలో కొంత భాగాన్ని ఏపీ ప్రభుత్వం కూలగొట్టించింది.
మొత్తం ఈ ఆస్తిని పోగొట్టుకోకుండా ఉండాలంటే బీజేపీలో చేరడమే బెటర్ అనుకుని ఆయన చేరిపోయారు.టిడిపి ఎమ్మెల్సీ గా చేసిన వాకాటి నారాయణరెడ్డి పరిస్థితి ఇంతే.
బ్యాంకులను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయిన ఆయనను తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది.కొద్దిరోజుల క్రితమే ఆయన బెయిల్ పై వచ్చారు.
ఈ పరిస్థితుల్లోనే జాతీయ పార్టీ అండ అవసరమనే ఉద్దేశంతో ఆయన బీజేపీలో చేరినట్టు కనిపిస్తోంది.ప్రస్తుతం నాయకులు బీజేపీలోకి వస్తే చాలు, ఎవరు ఎటువంటి వారు అయినా ఫర్వాలేదు అన్నట్టుగా బీజేపీ వ్యవహరించడం మాత్రం విమర్శల పాలవుతోంది.