ఇప్పటివరకు దృష్టిపెట్టని అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దృష్టిపెడుతూ ప్రత్యర్థులకు దడ పుట్టించే కార్యక్రమాలకు నాంది పలుకుతోంది.వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలన మీదే జగన్ దృష్టిపెట్టాడు.
సహజంగా అధికార పార్టీ కావడంతో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, ఇతర పార్టీల శాసన సభ్యులు ఇలా అంతా క్యూ కట్టారు.అయితే వారు వస్తామన్నా జగన్ మాత్రం వలసలను ప్రోత్సహించేందుకు ససేమీరా అనడంతో పాటు కొన్ని కఠిన నిబంధనలు కూడా పెట్టడంతో ఇప్పటివరకు చెప్పుకోదగిన వలసలు వైసీపీలోకి లేవు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో ఇప్పుడు పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకునేందుకు సిద్ధం అయ్యింది.అది కూడా ప్రజాప్రతినిధుల్ని కాకుండా ఏ పదవి లేని వారిని చేర్చుకోవాలని చూస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఎక్కడెక్కడ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో పడింది.
ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టినట్టుగా కనిపిస్తోంది.దీనిలో భాగంగానే విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నేత అడారి తులసీరావు కుమారుడు ఆనంద్, కుమార్తె రమాకుమారి తాజాగా జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయారు.అడారి ఆనంద్ అనకాపల్లి నుంచి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓటమిచెందారు.
ఇక రమాకుమారి యలమించిలి మున్సిపల్ వైస్ చైర్మన్ గా పని చేశారు.తులసీరావు అయితే దశాబ్దాలుగా టీడీపీలోనే ఉన్నారు.
ఇక వైసీపీ టార్గెట్ చేసిన నేతలు తాము చెప్పినట్టుగా పార్టీలో చేరకపోతే వారికి ఆర్థిక దిగ్బంధనం,అలా కాకపోతే కేసులు అంటూ భయపెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.ఇప్పటికే ఈ రకమైన ఒత్తిళ్లు కొంత మందిపై ప్రారంభం కావడంతో ఆజ్ఞాతంలోకి కూడా వెళ్లిపోయారట.
మరికొంతమంది మాత్రం ఎందుకొచ్చిన గొడవ అంటూ వైసీపీలో చేరిపోతున్నారట.
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నుంచి పోటీ చేసిన వరుపుల రాజా అనే నాయకుడు కూడా ప్రెస్‌మీట్ పెట్టి మరి జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.
టీడీపీకి రాజీనామా చేశారు.టీడీపీ ఒక సామాజికవర్గానిదే అంటూ ఆరోపణలు చేశారు.కాపు రిజర్వేషన్లపై జగన్ వైకిరిని కూడా సమర్థించారు.వాస్తవంగా అయితే రాజా ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా టీడీపీ తరపున యాక్టివ్ గా ఉన్నారు.
కానీ ఆయన తన నియోజకవర్గంలో ఇసుక వ్యవహారాల్లో నిండా మునిగి ఉండటంతో ఆ వైపు నుంచి ఒత్తిళ్లు రావడంతో టీడీపీకి రాజీనామా చేయక తప్పలేదని స్థానికంగా వినిపిస్తున్న మాటలు.వీరి మాదిరిగానే మరికొంత మంది నేతలనూ వైసీపీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక నుంచి వరుసగా చేరికలు ఉంటాయని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు.అయితే ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయా లేదా అన్న విషయంపై ఆ పార్టీ నుంచి క్లారిటీ రావడంలేదు.