‘మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా’ అనే ఓ సినిమాలోని డైలాగు తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు కొందరు అన్వయించుతున్నారు.తెలంగాణలో పరిపాలన అంతా సరికొత్తగా చెయ్యడంతో పాటు అనేక మార్పు చేర్పులు చేయాలనీ చూస్తున్న కేసీఆర్ అందుకు తగ్గట్టుగానే అనేక కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నాడు.
తాజాగా తెలంగాణాలో పంచాయతీ, మున్సిపల్ చట్టాలను కొత్తగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.ఈ చట్టం ద్వారా ఉప సర్పంచులకు జాయింట్ గా చెక్ పవర్ ఇవ్వడం వంటి అంశాల మీద ఇప్పటికే చాలామంది సర్పంచులు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
ఈ చట్టాన్ని మార్చకపోతే తామంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామంటూ సర్కార్ మీద బెదిరింపులకు కూడా దిగుతున్నారు.అదే సమయంలో ఉద్యోగ సంఘాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి.

ఈ సమస్య రోజు రోజుకి ఉదృతం అవుతుండడంతో కేసీఆర్ గట్టిగానే స్పందిస్తున్నారు.తాము ఈ చట్టాలను తప్పకుండా అమలుచేసి తీరుతామని, ఎవరైనా ఈ విషయంలో అడ్డుపడితే వారిపై వేటు వేసేందుకు కూడా వెనకాడబోమని కేసీఆర్ ఇప్పటికే హెచ్చరికలు చేసాడు.అయితే ఇది ఖచ్చితంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతుందని, పార్టీకి కూడా ఇది మంచిది కాదంటూ కేసీఆర్ కి సొంత పార్టీ నేతలు కొంతమంది నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కేసీఆర్ ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.వారు ఎవరిని బెదిరిస్తారు ? మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే నష్టపోయేది వారేననీ, వారి పదవులే పోతాయనీ, వారి స్థానంలో ఉప సర్పంచులకు పవర్స్ వస్తాయని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది.

ప్రతి వారు బెదిరించడం మామూలు అయిపోయిందని, వారు వీరు ఏదో చేస్తారని భయపడుతూ ఉంటే అలా బెదిరిస్తూనే ఉంటారు అంటూ కేసీఆర్ అన్నట్టు సమాచారం.వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రక్షాళన అనేది తప్పకుండా జరగాలని కేసీఆర్ అన్నారు.అందుకోసం మొండిగా ముందుకు వెళ్లినా తప్పులేదనీ, మహా అయితే మనల్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారనీ, ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్నాం, ఓసారి ప్రతిపక్షంలో కూర్చుంటాం అంతే అని కొందరు నేతలతో కేసీఆర్ చెప్పారని సమాచారం.ఉద్యోగుల విషయమై మాట్లాడుతూ తెగేదాకా ఏ విషయాన్ని లాగొద్దని ఉద్యోగ సంఘాలకు చెప్పండి అంటూ కొందరు నేతలకు కేసీఆర్ చూచించినట్టు సమాచారం.
కేసీఆర్ తాజా వైఖరితో పార్టీ మీద కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోందని టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు.