బస్ ప్రయాణం అయినా ఇబ్బంది పడేవారుంటారు కానీ ట్రెయిన్ జర్నీ అంటే ఎగిరి గంతేయని వారుండరు.చిన్నప్పుడైతే ట్రెయిన్ లో విండో సీట్ వస్తే బాగున్ను అని అనుకుంటాం.
ఇప్పటికీ కూడా విండో సీట్ కావాలనుకునే వారుంటారు.నిద్రప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు.
అయితే ఒకప్పటి భారత రైల్వే వ్యవస్థకు ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఎంతో ఆధునీకత చోటుచేసుకుంది.
స్టేషన్ లు ట్రైన్ లు చాలా పరిశుబ్రాంగా కనిపిస్తున్నాయి.
అయితే ఓ వైపు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని రైల్వేశాఖ చర్యలు చేపడుతుంటే …మరోవైపు కల్పించిన సౌకర్యాలకే రక్షణ లేకుండా పోతోంది.
అంతగా దిగజారి ప్రవర్తిస్తున్నారు కొందరు ప్రయాణికులు.కొందరు ప్రయాణికుల వ్యవహార శైలితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది శాఖ.
రైల్వే ప్రయాణికులే రైళ్లలోని బ్లాంకెట్లు, దిండ్లు, బెడ్ షీట్లు, టవల్స్, తదితర వస్తువులు దొంగలించుకుపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.గత ఆర్థిక సంవత్సరంలోనే 1.95లక్షల టవల్స్, 81,736 బెడ్‌షీట్లు, 55,573 దిండ్ల కవర్లు, 5,038 దిండ్లు, 7,043 బ్లాంకేట్లు ప్రయాణికులే చోరీ చేశారు.మరిన్ని ఆస్తులను ధ్వంసం చేశారు.ఒక్కో బెడ్ షీట్ ధర రూ.132 కాగా, టవెల్స్ ధర రూ.22, దిండు ధర రూ.25.
గత మూడేళ్లలో భారత రైల్వే సుమారు రూ.4,000కోట్ల విలువైన ఆస్థిని నష్టపోయింది.ఇందులో మేజర్ వాటా ప్రయాణికుల దొంగతనాలే కారణమంటున్నారు రైల్వే అధికారులు.రైళ్లలో దొంగతనాలు జరుగుతూ ఉంటే రైల్వే శాఖ ఛార్జీలను కూడా పెంచే అవకాశం ఉంది.అందుకే ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతోంది రైల్వే శాఖ.