ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలంటే ఉన్నంత చిన్నచూపు మరి వేటిపైనా ఉండదేమో.పిల్లల్ని చేర్చాలంటే తల్లిదండ్రులు వెనక్కి తగ్గుతారు.
గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి పిల్లలు ఇష్టం చూపరు.ఇక టీచర్ల సంగతి సరేసరి.
తీసుకుంటున్న జీతాలకు,చెప్తున్న చదువులకు పొంతన ఉండదు.కానీ ఈ టీచరమ్మ అలాంటిలాంటి టీచరమ్మ కాదు,విధ్యార్ధులను తన సొంత పిల్లల్లా చూసుకుని చదువు చెప్పింది.
తమ పిల్లలకు వెలుగు చూపిన ఆ టీచరమ్మకు గ్రామస్తులంతా కలసి ఒక చక్కని బహుమతి ఇచ్చారు.
మహారాష్ట్రలోని పుణే జిల్లా శిరూర్ తాలూకాలోని పింపుల్ ఖాల్సా గ్రామంలోని జిల్లా పరిషత్ స్కూల్లో లలితా ధుమాల్ అనే ఉపాధ్యాయురాలికి పిల్లలపై శ్రద్ధ ఎక్కువ.వారు బాగా చదవాలని, పైకి స్థాయికి ఎదగాలని కోరిక.స్కూల్లో 5వ తరగతిలో 19 మంది పిల్లలు ఉన్నారు.
లలిత వారందరికీ ప్రభుత్వ స్కాలర్ షిప్పులు రావడానికి ప్రత్యేక క్లాసులు నిర్వహించారు.పుస్తకాలు కొని, వారితో చదివించారు.
పండగ రోజుల్లో సైతం చదువు చెప్పారు.ఆ పిల్లలు కూడా తన పిల్లలే అన్నట్లు చదివించారు.
ఆమె కల నిజమైంది.స్కాలర్ షిప్ పరీక్షలో ఆ 19 మంది విద్యార్థులూ పాసయ్యారు.
దీంతో వారి తల్లిదండ్రుల సంబరానికి అడ్డులేకుండా పోయింది.టీచరమ్మ రుణాన్ని తీర్చుకోవడానికి అందరూ చందాలు వేసుకుని కారును కొని కానుకగా అందించారు.
‘పిల్లలు బాగా కష్టపడి చదివారు.నిజానికి ఈ స్కూల్లో గతంలో పనిచేసిన టీచర్లు కూడా పిల్లలను బాగా చదివించారు.మంచి మార్కులతో పాస్ చేయించారు.నేనూ అదే పనిచేశాను.
అయితే గ్రామస్తులు ఇదివరకు టీచర్లకు ఫ్రిజ్, టూవీలర్లను గిఫ్ట్‌గా ఇచ్చేవారు.నాకు మాత్రం కారును ఇచ్చారు.
నేను కోచింగ్ ఇవ్వడం వల్లే తమ పిల్లలు స్కాలర్ షిప్ సాధించారని వారంటున్నారు.గత ఏడాది కూడా 21 మంది స్కాలర్‌షిప్ సాధించారు.
ఇది అందరి శ్రమ ఫలితం.’ అని ఆమె చెప్పింది…
.