మీరు ఎపుడైనా మబ్బులను తాకే పొడవైన స్కై బ్రిడ్జిని చూసారా? మీలో కొంతమంది అలాంటివాటిని చూసే వుంటారు.ముఖ్యంగా చిన్న చిన్న స్కై బ్రిడ్జిలను చాలామంది చూస్తారు.
కానీ ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జిని చెక్ రిపబ్లిక్ దేశం తమదేశపు పాదచారులకోసం ప్రారంభించింది.ఇప్పుడు ఈ బ్రిడ్జి చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అద్భుతమైన ప్రకృతి నడుమ మేఘాలను తాకుతున్నాయన్నట్టుగా ఉండే 2 కొండల మధ్యన నిర్మించిన ఈ వంతెనకు స్కై బ్రిడ్జి 721 అనే పేరును పెట్టారు.
ఈ బ్రిడ్జితో మమేకమైన ప్రకృతి సౌందర్యం ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందో వంతెన పైకి వెళ్తే అంతే భయం కూడా కలుగుతుంది మరి.లోయలో 95 మీటర్ల ఎత్తున వేలాడుతూ 721 మీటర్ల పొడవుతో రెండు కొండలకు మధ్య వేలాడే వంతెనను దాదాపు ఓ 2 సంవత్సరాలపాటు నిర్మించారట.దీనికి 84 లక్షల డాలర్లను, అంటే సుమారు 66 కోట్ల రూపాయిలను చెక్ ప్రభుత్వం కేటాయించడం గమనార్హం.
ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెనగా ఇది పేరు గాంచింది.అతి పెద్ద బ్రిడ్జి గా నేపాల్‌లోని బగ్లుంగ్ పర్వతల్లోని బ్రిడ్జికి ఇంతకు ముందు పేరుంది.అయితే ఇపుడు దీని రికార్డును స్కైబ్రిడ్జి 721 బద్దలు కొట్టి గిన్నీస్ బుక్ రికార్డులకెక్కింది.ఈ వంతెన రాజధానికి ప్రేగ్‌కు అతి సమీపంలో ఉంది.
అయితే ఈ బ్రిడ్జి ఎక్కిన వారికి ఒకింత ధైర్యం కావాలి సుమా.దీన్ని ఎక్కినవారు భయం మరియు వింత అనుభూతికి లోనవుతూ, మిశ్రమ భావోద్వేగాలను కలిగి వుంటారు.దీనిని ఎక్కినవారు తమ అనుభవాలను పలు వీడియోలు, చిత్రాలద్వారా అంతర్జాలంలో ఎంట్రీ ఇస్తూ వుంటారు.ఇక్కడ పర్యాటకులు గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమంటే, ఎట్టి పరిస్థితులలోనూ ఈ వంతెన హృద్రోగులకు సరికాదని చెప్పబడుతుంది.
మీకు ఈ వంతెనను ఎదుర్కోడానికి ధైర్యసాహసాలు ఉన్నాయని భావిస్తే, ఈ సారి ట్రిప్ ప్రయత్నించి చూడండి.