తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పధకం దళిత బంధు. ఈ పధకం ప్రారంభించిన నాటి నుండి రాజకీయం మొత్తం ఈ పధకం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉంది.
దళితులు ఆర్థికంగా వృద్ధిలోకి రావాలనే ఉద్దేశ్యంతో ఈ పధకం ప్రవేశపెట్టమని ప్రభుత్వం చెబుతోంది.కానీ ప్రతిపక్షాలు మాత్రం హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ పధకాన్ని ప్రవేశపెట్టారని అంతేకాక హుజూరాబాద్ లో ఎక్కువ శాతం దళితుల ఓట్లు ఉన్నాయి కావున దళితుల మద్దతు పొందడానికి ప్రభుత్వం ఈ తరహా ఎత్తుగడ వేసిందని వ్యాఖ్యానిస్తున్నాయి.
అయితే దళిత బంధు పధకం ప్రవేశపెట్టకపోతే గెలిచే అవకాశాలు బీజేపీ కే ఎక్కువగా ఉండేవి.
ఎందుకంటే ఈటెల పట్ల పెద్ద ఎత్తున వ్యక్తమయిన సానుభూతి లో టీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడానికి ఏ ఒక్క కారణమూ లేని పరిస్థితి ఉండేది.
ప్రస్తుతం దళిత బంధు ఉండడంతో అంతేకాక దళితులకు ఒక్కో ఇంటికి పది లక్షలు ఇస్తుండడంతో టీఆర్ఎస్ వైపుగా ఆలోచిస్తుండటంతో ప్రస్తుతం బీజేపీకి, టీఆర్ఎస్ కు పోటా పోటీ వాతావరణం నెలకొంది.దీంతో దళిత బంధు పధకం పొందిన లబ్ధిదారులు టీఆర్ఎస్ కు మద్దతిస్తే టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండే అవకాశం ఉంది.

దళితుల ఓట్లలో చీలిక వస్తే చివరి నిమిషం వరకు ఎన్నిక ఫలితం ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంది.అంతేకాక ఫలితం పట్ల ఏదైనా ఒక పార్టీ అసంతృప్తిగా ఉంటే కొంత గందరగోళ పరిస్థితులు దారితీసే అవకాశం ఉంది.ఏది ఏమైనా దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం విషయంలో ఏ మేరకు ఆసక్తి నెలకొందో, అంతకు మించిన ఆసక్తి హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం పట్ల నెలకొంది.మరి దళిత బంధు టీఆర్ఎస్ కు, బీజేపీకి ఎటువంటి అనుభవాన్ని మిగుల్చుతుందనేది చూడాల్సి ఉంది.