టాక్సీలు నడపడం నుంచి డెలివరీలు అందించే వరకు ఇలా ఒకటేంటి.చెప్పాలంటే మహిళలు ఎన్నో కష్టతరమైన వృత్తుల్లో మగవారికి పోటాపోటీగా ఉద్యోగాలు చేస్తున్నారు.
అయితే ఇలాంటి శ్రమతో కూడిన కొలువులు చేస్తున్నప్పుడు నెలసరి వల్ల మహిళలు చాలా అసౌకర్యానికి గురవుతున్నారు.ప్రతినెలా నెలసరి సమయంలో ఏం కారణం చెప్పి సెలవు తీసుకోవాలో అర్థం కాక సతమతమవుతున్నారు.
పీరియడ్స్ వంటి వ్యక్తిగత కారణాలతో సెలవులు అడగడానికి కూడా చాలామంది సంకోచిస్తున్నారు.
అయితే మహిళలు పడుతున్న ఇబ్బందిని గుర్తించిన ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళా డెలివరీ ఉద్యోగులు తమ నెలసరి సమయంలో కారణం చెప్పకుండానే రెండు రోజులు సెలవు తీసుకోవచ్చని వెల్లడించింది.అంతేకాదు ఈ రెండు రోజులను పెయిడ్ లీవ్స్ గా పరిగణించి ఆ రెండు రోజులకు జీతాలు కూడా ఇస్తామని ప్రకటించింది.ఈ గుడ్ న్యూస్ ను స్విగ్గీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిహిర్ షా తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించారు.
“పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే అసౌకర్యాలు గురించి అందరికీ తెలుసు.అయినప్పటికీ వాళ్లు ముందడుగు వేసి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.అలాంటి మహిళలకు అండగా ఉండేందుకే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.మేం ప్రకటించిన రెండు సెలవు దినాలను మహిళలు ఏ కారణం చెప్పకుండానే ఉపయోగించవచ్చు” అని మిహిర్ పేర్కొన్నారు.

దీంతో మహిళల సౌకర్యార్థం స్విగ్గీ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సంస్థలో డెలివరీ విమెన్‌గా పని చేసే వారు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సెలవలు ఇవ్వడమే కాకుండా జీతాన్ని కూడా చెల్లిస్తామనే గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
అయితే స్విగ్గీ సంస్థ గతంలోనే మహిళల భద్రత గురించి ఆలోచించింది.ఇందులో భాగంగా బిజీ వేళల్లోనూ మహిళల పని వేళలను సాయంత్రం ఆరు గంటల వరకే పరిమితం చేసింది.