దక్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది.భారత సంతతికి చెందిన క్రికెట్ దిగ్గజం హుస్సేన్ అయోద్ అనారోగ్యంతో కన్నుమూశారు.
ఆయన వయసు 81 సంవత్సరాలు.ఫాస్ట్ బౌలర్ అయిన హుస్సేన్ వర్ణ వివక్ష కారణంగా దేశం తరపున ఎన్నడూ ప్రాతినిథ్యం వహించలేకపోయారు.
కానీ దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఆటగాళ్లలో ఒకరిగా హుస్సేన్ గుర్తింపు తెచ్చుకున్నారు.ఆ దేశ సమాజంలోని వర్ణ వివక్ష కారణంగా అతనికి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడానికి అనుమతి లభించలేదు.
పోర్ట్ ఎలిజబెత్‌లోని కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన శనివారం ఉదయం కిడ్ని వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.అయోద్ తన జీవితంలో వ్యక్తిగతంగానూ, వృత్తిగతంగానూ ఎన్నో అడ్డంకులను అధిగమించారు.
ఇందుకు సంబంధించిన వివరాలను తన పుస్తకం ‘Crossing Boundaries‘లో పొందుపరిచారు.పుస్తకం ముందుమాటను దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ రాశారు.
జీవితంలో అత్యుత్తమతను సాధించడానికి హుస్సేన్ పట్టుదలను ప్రదర్శించారని లాయిడ్ వ్యాఖ్యానించారు.
యునైటెడ్ క్రికెట్ బోర్డ్ (ప్రస్తుత క్రికెట్ సౌతాఫ్రికా) ప్రారంభించబడటంలోనూ… దక్షిణాఫ్రికా అంతర్జాతీయ స్థాయికి చేరడంలోనూ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అభివృద్ధి కమిటీలోనూ అయోద్ కీలకపాత్ర పోషించారు.70 ఏళ్ల వయసులోనూ ఆయన కోచ్‌ల శిక్షణను చేపట్టారు.ఆఫ్రికా అంతటా పర్యటించి.
క్రికెట్ విస్తరణలోనూ కీలకపాత్ర పోషించారు.ఆఫ్రికా ఖండంలోని వేలాది మంది పిల్లలకు క్రికెట్ పట్ల ప్రేమను పెంపొందించడానికి మార్గనిర్దేశం చేశారు.
హుస్సేన్ అయోద్ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ట్రాన్స్‌వాల్ పాత ప్రావిన్స్‌లోని అనేక పాఠశాలల్లో సేవలందించారు.ఆయన డయాలసిస్ పేషెంట్‌గా అనుభవించిన మానసిక, శారీరక బాధల గురించి రోగులకు, ప్రజలకు వివరించడానికి ‘My Last Innings’ పేరుతో రెండవ పుస్తకం తెచ్చే పనిలో వున్నారు.