బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది.తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు సుశాంత్ ఆత్మహత్య ఘటన పై విచారణ జరుపుతుండగా డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యవహారం పై ముంబై నార్కోటిక్స్ పోలీసులు తమ దర్యాప్తు లో భాగంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసును సీబీఐ కు అప్పగించగా విచారణ లో డ్రగ్స్ రాకెట్ అంశం వెలుగులోకి వచ్చింది.
దీనితో ముంబై నార్కోటిక్స్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
రియా సోదరుడు శౌవిక్ చక్రవర్తి తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ ను కూడా నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేయగా ,ఇప్పుడు తాజాగా రియా చక్రవర్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.ఇటీవల రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి కూడా తరువాతి అరెస్ట్ నా కూతురు రియా దే అంటూ వ్యాఖ్యలు చేయగా,ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలే నిజమయ్యాయి.
ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద రియాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.అరెస్టు చేసిన తర్వాత డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్‌సీబీ తీసుకువెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రియా సోదరుడు శౌవిక్ చక్రవర్తే తన సోదరికి డ్రగ్స్‌తో లింకు ఉన్నట్లు చెప్పడం తో పాటు ఎన్‌సీబీ సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా రియాకు డ్రగ్ డీలర్స్ తో లింకులు ఉన్నట్లు తేలింది.దీనితో ఆమెను అదుపులోకి తీసుకొని మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.
తొలుత ఆమె అసలు డ్రగ్స్ తీసుకున్నదో లేదో అన్న కోణంలో ఎన్‌సీబీ అధికారులు ఆమెకు డ్రగ్స్ పరీక్షలు చేయించనున్నారు.మెడికల్ పరీక్ష తర్వాత రియాను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నట్లు సమాచారం.