త్వరలో జరగబోయే మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తున్నారు.ఇక్కడ గెలవడం ద్వారా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి బాటలు వేసినట్టు అవుతుందని నమ్ముతున్నారు.
దీనిలో భాగంగానే తాను అలర్ట్ గా ఉండడంతో పాటు, పార్టీ నాయకులు ఎన్నికల్లో అంతే అలర్ట్ గా పనిచేసి కాంగ్రెస్ కు విజయం తీసుకువచ్చే విధంగా చేయాలని భావిస్తున్నారు.అయితే పార్టీలో నెలకొన్న గ్రూపు రాజకీయాలు ఎక్కడ కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీస్తాయో అన్న భయమూ రేవంత్ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోంది.
అందుకే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి మండలాలు వారీగా, గ్రామాల వారీగా ఇన్చార్జిలను నియమించారు. వీరిలో ఎక్కువగా నియోజకవర్గ స్థాయి నాయకులు , మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి గనుక ఇక్కడ విజయాన్ని దక్కించుకుంటే. గ్రామాలు, మండలాల వారిగా ఇంచార్జీ లుగా పని చేసి అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కి మెజార్టీ తీసుకువస్తే… వారికి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా టికెట్ ఇప్పించే బాధ్యత తనదని, వారికి టికెట్ ఇచ్చే విధంగా అధిష్టానంతో తాను పోరాడుతానని రేవంత్ హామీ ఇవ్వడంతో నియోజకవర్గంలో ఇన్చార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిలో ఎక్కడలేని ఆనందం కనిపిస్తోంది.
రేవంత్ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుని ఇక్కడ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని , తద్వారా తమకు టికెట్ తప్పకుండా దొరుకుతుందనే లెక్కల్లో ఇక్కడి ఇన్చార్జీలు ఉన్నారు.

అసలు రేవంత్ ఈ ఆఫర్ ప్రకటించడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి.తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి వర్గం ఎక్కువగా ఉంది.అలాగే ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని వ్యతిరేకించే వర్గం ఉండడం, అలాగే ఈ ఎన్నికల్లో టికెట్ ఆశించి బంగపడిన వారు గ్రూప్ రాజకీయాలకు పాల్పడతారని, అభ్యర్థి విజయవకాశాలను దెబ్బతీస్తారనే భయం రేవంత్ లో ఉంది.
ఈ మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది ని గెలిపించడం ద్వారా అధిష్టానం వద్ద తన పలుకుబడి పెంచుకోవడంతో పాటు, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో వచ్చే విధంగా మార్గం ఏర్పడుతుంది అని రేవంత్ భావిస్తున్నారు.అందుకే ఈ గ్రూపు రాజకీయాలను తట్టుకుని పార్టీ అభ్యర్థి విజయం సాధించేలా చేయాలంటే ఇదొక్కటే మార్గంగా రేవంత్ భావిస్తున్నారట.