తెలంగాణ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.టీఆర్ఎస్ మద్దతుదారులుగా పేరుపడ్డ వారందరూ ఓటమి చెందడంతో ఆ అపవాదుని తమ ఖాతాలో వెసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తమ పార్టీకి చెందిన వారు టీఆర్ఎస్ కి చెందిన వారు కాదు అంటూ చెబుతున్నా అసలు నిజం ఏంటో ప్రజలకు తెలుసునని ప్రతి పక్షాలు వాదిస్తున్నాయి.అదీ కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరిగాయి.
అందులో విజయం సాధించిన వారందరిని తమ పార్టీ వారీగా టీఆర్ఎస్ ప్రకటించుకుంది.
ఇప్పుడు ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను టీఆర్ఎస్ ఉపయోగించుకోవాలని చూస్తోంది.
పార్టీ రహితంగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ ఓటమి పాలైన సంగతిని పక్కనపెడితే రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ కు ఉద్యోగులు దూరం అవుతున్నారు అనే విషయం మాత్రం తెరపైకి వచ్చింది.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కావడంతో టీచర్లు అంతా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు అర్ధం అయ్యింది.
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన 20 రోజుల్లోగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండడంతో దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందా అని టీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది.

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వం లోనూ జరుగుతున్న పరిణామాలను అంచనా వేస్తూ నివేదికలు తెప్పించుకుంటూ పరిస్థితిని అంచనా వేస్తోంది.ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల్లో కనిపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుని అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.