మన్యం వాసులకు డోలి కష్టాలు తప్పడం లేదు.అత్యవసర పరిస్థితుల్లో మారుమూల గిరిజన పల్లెల నుంచి ఆస్పత్రులకు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు అడవి బిడ్డలు.
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని సున్నంపాడు గ్రామ పరధి నూరుపూడి కి చెందిన మహిళకు నెలల నిండటంతో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది.రవాణా వ్యవస్థ లేని నూరుపూడి గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లాలంటే 8 కిలోమీటర్లు ప్రయాణించాలి.
గ్రామానికి చెందిన చెదల శ్రీలేఖ అనే 26 ఏళ్ల నిండు గర్భిణీ పరిస్థితి తెలుసుకున్న ఎంపిటిసి మడకం అనిల్ కుమార్ స్వయంగా డోలీ ఏర్పాటు చేసారు.
నూరుపూడి నుంచి శ్రీలేఖ బంధువులతో కలసి ఆయన డోలీలో ఆమెను 8 కిలోమీటర్లు మోసుకువెళ్లారు.
నూరుపూడి గ్రామానికి రహదారి లేకపోవడంతో 108, 104 వాహనాలకు అక్కడికి వెళ్లే అవకాశం లేదు.దీంతో అత్యవసర పరిస్థితుల్లో సైతం డోలీలే గిరిపుత్రులకు ఆసరాగా నిలుస్తున్నాయి.8 కిలోమీటర్లు మేర బంధువులతో పాటు డోలీలో గర్భిణీని తరలించడంలో చొరవ చూపిన ఎంపిటిసి మడకం అనిల్ కుమార్ ను గ్రామస్తులు అభినందించారు.సకాలం స్పందించిన ఆయన తీరును కొనియాడారు.