తెలుగుదేశం పార్టీలో లోకేష్ ప్రభావం పెంచే విధంగా చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు.ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితం కావడంతో ఇప్పుడు పార్టీ పటిష్టత పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
అధికార పార్టీ దూకుడును అడ్డుకుంటూనే పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.ఈ సమయంలోనే తన రాజకీయ వారసుడు లోకేష్ కు పార్టీలో ప్రాధాన్యం పెంచాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
తనకు ఇప్పటికే 70 సంవత్సరాలు వయసు రావడం, విశ్రాంతి తీసుకునే సమయం దగ్గర్లోనే ఉండడంతో చంద్రబాబు పార్టీలో లోకేష్ కు తిరుగు లేకుండా చేయాలని చూస్తున్నారు .మరికొద్ది రోజుల్లో మహానాడు నిర్వహించబోతున్నారు.ఈ సందర్భంగా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు.
ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో అటువంటి పోస్ట్ ఏదీ లేకపోయినా, లోకేష్ కోసం కొత్త గా ఆ పదవిని సృష్టించబోతున్నారట.
తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులకు కొదవేలేదు.దాదాపుగా చంద్రబాబు తో మొదటి నుంచి అంటిపెట్టుకుని ఉన్న నాయకులు తమ వారసులను కూడా రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో మెజారిటీ నాయకులు లోకేశ్ నాయకత్వం ను సమర్థించడం లేదు.ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే, తెలుగుదేశం పార్టీ పూర్తిగా దెబ్బతింటుందని, లోకేష్ కు ఇంకా తెలుగుదేశం పార్టీని నడిపించే అంత సత్తా లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చిన వారంతా లోకేష్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు.అంతేకాకుండా మంగళగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన లోకేష్ ఘోరంగా ఓటమి చెందడం వంటివి కూడా ఆయన అసమర్ధతకు కారణంగా చూపిస్తున్నారు.

ఇక లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించిన పార్టీ సీనియర్లు ఆయనకు సహకరించే అవకాశం పెద్దగా లేదనే భావనకు వచ్చిన చంద్రబాబు పార్టీలో లోకేష్ కు ఒక సొంత టీమ్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారట.ఇప్పటికే దీనికి సంబంధించి కొంత మంది పేర్లను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.వారితో ఒక కమిటీని ఏర్పాటు చేసి లోకేష్ కు అండగా నిలబడేందుకు, అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందించే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం.మరి కొద్ది రోజుల్లో జరగనున్న మహానాడు కార్యక్రమంలో లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి తో పాటు, యువ నాయకులతో ఏర్పాటు చేయబోతున్న టీమ్ ను కూడా చంద్రబాబు ప్రకటించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ.