దేశంలోని మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.రోజు రోజుకు కూడా ఆ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి.
అధికారులు ఎంతలా చర్యలు చేపట్టినప్పటికీ కూడా కరోనా ను కట్టడి మాత్రం చేయలేకపోతున్నారు.రోజుకు 1000, 1500 కేసుల నుంచి ఇప్పుడు అక్కడ ఒక్కరోజులోనే 2,345 పాజిటివ్ కేసులు నమోదవ్వడం మరింత కలవరపెడుతుంది.
అంతేకాకుండా ఒక్క రోజులోనే 64 మంది మృత్యువాతపడ్డారు.దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 41,642 నమోదు కాగా, మరణాల సంఖ్య 1,454కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
నమోదైన ఈ కేసుల్లో మాతుంగా లేబర్ క్యాంపులో అత్యధికంగా ఆరు, ముకుంద్‌నగర్ ప్రాంతంలో ఐదు కేసులు నమోదైనట్టు బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.ముంబైలోని ధారవిలో కొత్తగా 47 కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య 1,454కి చేరినట్లు తెలుస్తుంది.
మరోపక్క రాష్ట్ర పోలీసులకు సహకరించేందుకు కేంద్రం ధారవి ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలు (సీఏపీఎఫ్) మోహరించాయి.నిన్న రాత్రి సీఐఎస్ఎఫ్ సిబ్బంది బెండీ బజార్లో కవాతు నిర్వహించారని అధికారులు వెల్లడించారు.

ముంబైలో సోమవారం ఐదు కంపెనీల సీఏపీఎఫ్ బలగాలను మోహరించినట్టు అధికారులు పేర్కొన్నారు.కాగా, కరోనా కాలంలో ఎంతో శ్రమించి పనిచేస్తున్న ముంబై పోలీసులకు వాడియా కుటుంబం చేయూతగా నిలిచింది.తమ బాంబే డయింగ్ సంస్థ తరఫున ముంబయి పోలీస్ ఫౌండేషన్‌కు రూ.రూ.27లక్షలు విరాళంగా ప్రకటించింది.ఈ మేరకు ముంబై పోలీస్ కమిషనర్ ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ మొత్తాన్ని పోలీసుల సంక్షేమం కోసం వినియోగిస్తామని వెల్లడించారు.