మరాఠా వీరుడు, హిందుత్వ వాదుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అమెరికాలో ఘోర అవమానం జరిగింది.కొద్దిరోజుల క్రితం అదృశ్యమైన శివాజీ విగ్రహం చెత్తకుప్పలో ప్రత్యక్షమైంది.
వివరాల్లోకి వెళితే.కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌జోస్ నగరంలోని పార్క్ ఆవరణలో వున్న శివాజీ మహరాజ్ విగ్రహం గత నెల 31న అదృశ్యమైంది.
దీనిని భారత్‌లోని పుణే నగరానికి చెందిన పలువురు 1999లో శాన్‌జోస్ పార్క్‌కు కానుకగా ఇచ్చారు.అంతేకాదు ఉత్తర అమెరికాలో వున్న ఏకైక శివాజీ విగ్రహం ఇదే కావడం గమనార్హం.
ఈ క్రమంలో జనవరి 29న ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు శివాజీ విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు.అప్పటి నుంచి దీనికోసం పోలీసులు, స్థానిక భారతీయ కమ్యూనిటీ గాలిస్తూ వుంది.
దాదాపు 200 కిలోల బరువున్న ఈ విగ్రహాన్ని ఫిబ్రవరి 9న ఒక మెటల్ స్క్రాప్ యార్డ్‌లో కనుగొన్నారు.ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అరెస్ట్‌లు చోటు చేసుకోలేదని కథనాలు వస్తున్నాయి.
శానోజోస్-పుణే సిస్టర్ సిటీ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సునీల్ కేల్కర్ మాట్లాడుతూ.విగ్రహం దొరికినందుకు ఆనందంగానే వుందన్నారు.
కానీ దాని కాళ్లు నరికివేసి వుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు.

అటు శాన్‌జోస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ మేనేజర్ జో హెడ్జెస్ సైతం శివాజీ విగ్రహం తిరిగి దొరకడంపై హర్షం వ్యక్తం చేశారు.దీనిని తిరిగి ప్రతిష్టించగలిగే స్థితిలోనే వుందన్నారు.అయితే ఈ శివాజీ విగ్రహం చోరీ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం.
శాన్‌జోస్‌కు బహుమతిగా వచ్చిన నెల రోజులకే ఇది దొంగిలించబడింది.ఆ తర్వాత దీని ఆచూకీని కనుగొన్నారు.
అనంతరం 2002లో విగ్రహాన్ని పున:ప్రతిష్టించారు.

ఇదిలావుండగా.భారతదేశం నుంచి ఖండాలు దాటిన మన సంపద ఎట్టకేలకు తిరిగి స్వదేశానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.2014 నుంచి విదేశాల నుంచి మొత్తం 229 పురాతన కళాఖండాలు, వస్తువులు తిరిగి భారతదేశానికి చేరుకున్నాయి.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటన చేసింది.ఇంగ్లాండ్‌లో వున్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం ఏమైనా ప్రణాళికలు రూపొందిస్తోందా అన్న ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి లిఖితపూర్వకంగా సమాధానం అందించారు.భారత్ నుంచి తరలిపోయిన అపురూప వస్తువులను తిరిగి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కట్టుబడి వుందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
భారతీయ మూలానికి సంబంధించిన ఏదైనా ప్రాచీనత విదేశాల్లో కనిపించినప్పుడల్లా.ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాటిని భారత రాయబార కార్యాలయాలు, విదేశాల్లోని మిషన్‌ల ద్వారా తిరిగి పొందేందుకు విదేశాంగ శాఖ చొరవ చూపుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.