తెలంగాణ లో కొద్దిరోజులుగా ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ భారీ వర్షాల దెబ్బకి వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణ వాసులు ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.మరో అయిదు రోజుల పాటు వాతావరణ ఎలా ఉండబోతుందో వెల్లడించింది.
ఈనెల 19న మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వాయుగుండం ఇప్పటికే అరేబియా సముద్రంలో కలిసిపోయిందని, భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్పష్టం చేసింది.19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు పడతాయని వివరించారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి తూర్పు మధ్య అరేబియా సముద్రం వెంట ఉత్తర కోస్తాంధ్ర, తెలంగాణ, దక్షిణ మహారాష్ట్ర, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కొంకన్ ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని తెలిపింది.
దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మహారాష్ట్ర తీరం మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని అధికారులు చెప్పారు.
ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల నేడు శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది.