యూకేలో గతేడాది భారతీయ విద్యార్ధినిని హత్య చేసి, ఆమె స్నేహితురాలిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని మానసిక సంస్థలో నిర్బంధించారు.నిందితుడు కెవెన్ ఆంటోనియో లౌరెంకో డి మొరైస్( Keven Antonio Lourenco De Morais )ను గురువారం ఐల్వర్త్ క్రౌన్ కోర్టులో హాజరుపరచగా.
మానసిక ఆరోగ్య చట్టం 1983లోని సెక్షన్ 37 కింద కోర్టు శిక్ష విధించింది.కెవెన్ గతేడాది జూన్‌లో కత్తిపోట్లకు పాల్పడినందుకు సెక్షన్ 41 కింద రిస్ట్రిక్షన్ ఆర్డర్ విధించినట్లు లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు గతేడాది ఏప్రిల్ 22న అదే కోర్టుకు హాజరై నేరాన్ని అంగీకరించాడు.నార్త్ లండన్‌లోని వెంబ్లీలో గుర్తు తెలియని మరో బాధితురాలిపైనా హత్యాయత్నానికి పాల్పడినందుకు నేరాన్ని అంగీకరించాడు కెవెన్.
ఈ ఘటనపై మెట్ పోలీస్ స్పెషలిస్ట్ క్రైమ్ కమాండ్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ లూయిస్ కావీన్ మాట్లాడుతూ .ఈ మొత్తం ఘటన తనను ఆందోళనకు గురిచేసిందన్నారు.ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.మరో మహిళ జీవితాంతం ఆ గాయాల నుంచి కోలుకోదన్నారు.నిందితుడు కెవెన్ చికిత్స తీసుకోవడం సరైనదని, అయినప్పటికీ మృతురాలు తేజస్విని తిరిగి రాదని లూయిస్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వారం కోర్టులో హాజరుకావడానికి మూడు నెలల ముందు కెవెన్‌కు ‘‘ పారానోయిడ్ స్కిజోఫ్రెనియా ’’ అనే మానసిక వ్యాధి ఉన్నట్లుగా నిర్ధారణ అయ్యింది.
పెరోల్ కోసం పరిగణించబడటానికి ముందు కెవెన్‌కు కనీసం 9 ఏళ్ల కాలపరిమితితో జీవితఖైదు ఉంటుందని న్యాయమూర్తి తెలిపారు.ఆసుపత్రిలో ఉంచాలనే నిర్ణయం ప్రజల భద్రతకు ఉపయోగపడుతుందనే వైద్యుల సిఫారసును పరిగణనలోనికి తీసుకుని , వైద్య సంరక్షణకు అనుమతించినట్లు ఆయన పేర్కొన్నారు.
గతేడాది జూన్ 13న ఉదయం వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్‌లో కత్తిపోట్లు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు.లండన్ అంబులెన్స్ సర్వీస్‌తో పాటు అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు.హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల తేజస్విని, మరో 28 ఏళ్ల వయసున్న మహిళ కత్తి గాయాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు.వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినా తేజస్విని( Konatham Tejaswini Reddy ) ప్రాణాలు కాపాడలేకపోయారు.
ఆమె మరణవార్తను పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.మరుసటి రోజు లండన్ నార్త్విక్ పార్క్ మార్చురీలో నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో తేజస్విని మృతికి ఛాతీపై కత్తిగాయమే కారణమని తేలింది.
కత్తి దాడికి గురైన రెండవ బాధితురాలి పేరు అఖిలగా తెలుస్తోంది.ఆమె కూడా భారతదేశానికి చెందినవారేనని సమాచారం.
ఇండియన్ నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ (ఎన్ఎస్ఏ) ప్రకారం తేజస్విని పూర్తి పేరు .తేజస్విని కొంతంరెడ్డి.ఇటీవల దక్షిణ లండన్‌లోని గ్రీన్విచ్ యూనివర్సిటీ నుంచి ఆమె పట్టభద్రురాలైంది.పోస్ట్ స్టడీ వర్క్ వీసాను పొందేందుకు ప్రయత్నిస్తూ.నార్త్ లండన్‌లో ఉద్యోగం సంపాదించిన తర్వాత వెంబ్లీలోని ఫ్లాట్‌కు ఇటీవలే మారింది.