తెలంగాణ సీఎం కేసీఆర్ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.తెలంగాణ లో పార్టీ బాధ్యతలన్నీ ప్రస్తుతం మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చూస్తున్నారు.
కీలకమైన అంశాలపై మాత్రమే కేసీఆర్ స్పందిస్తున్నారు.పూర్తిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు .అందుకే కేంద్ర అధికార పార్టీ బిజెపిని టార్గెట్ చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు.ఢిల్లీ కేంద్రంగా ప్రజా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నిటినీ కలుపుకుని వెళుతూ, వారి అందరి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బాగా బలహీన పడడం, పుంజుకునే అవకాశాలు కనిపించకపోవడం వంటి వ్యవహారాలతో జాతీయ స్థాయిలో బీజేపీ కి ప్రత్యామ్నాయంగా జాతీయ పార్టీగా టిఆర్ఎస్ మారితే ఎలా ఉంటుందనే అంశంపై గత కొంత కాలంగా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
అందుకే జాతీయ స్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారట.బీజేపీ వ్యతిరేక పార్టీలు తమతో జత కలిస్తే జాతీయ స్థాయిలో అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదు అనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారట.
ఇప్పటికే బిజెపి రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.దేశవ్యాప్తంగా ధరల పెరుగుదల వంటి అంశాలపై ప్రజల్లో బిజెపి ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉంది.ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో పార్టీని ఏర్పాటు చేస్తే బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు తమకు కలిసి వస్తుందని, కాంగ్రెస్ పరిస్థితి ఎలాగూ అంతంతమత్రంగానే ఉంది కాబట్టి, ఇదంతా తమకు కలిసి వస్తుందనే లెక్కల్లో కేసిఆర్ ఉన్నారట.

మొన్నటి వరకు మూడో ప్రత్యామ్నాయ కూటమి అంటూ కేసీఆర్ హడావుడి చేశారు.కానీ ఆ కూటమి ప్రభావం అంతంత మాత్రంగానే ఉండేలా కనిపిస్తోంది.బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యే అవకాశం కనిపించడం లేదు .ఇటీవల బిజెపికి వ్యతిరేకంగా లేఖ రాసిన పార్టీల్లో కాంగ్రెస్ తో సహా, 13 మిత్రపక్షాలు ఉన్నాయి.అవన్నీ కాంగ్రెస్ పార్టీతోనే ఉండే అవకాశం కనిపిస్తోంది.
సంతకం చేయని ఎన్సీపీ, శివసేన పార్టీలు సైతం కాంగ్రెస్ వెంటే వెళ్లేలా ఉన్నాయి.దీంతో కేసీఆర్ చెప్పినట్లుగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు అవ్వడం , ఎన్నికలను ఎదుర్కోవడం అనేవి సాధ్యం కాదనే విషయం అర్థమైపోతుంది.
దీంతో జాతీయ పార్టీ ఏర్పాటు చేయడమే ఏకైక మార్గంగా కేసీఆర్ భావిస్తున్నారట.ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జాతీయస్థాయిలో పార్టీని పెట్టి బీజేపీని ఎదుర్కోవాలనే లక్ష్యంతో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన కూడా కెసిఆర్ చేయబోతున్నారట.