ప్రస్తుతం 65,000గా వున్న హెచ్ 1 బీ వీసాలను ( H1B visas )రెట్టింపు చేయాలని అమెరికాలో భారతీయ అమెరికన్ల యాజమాన్యంలో 2,100కు పైగా వున్న చిన్న , మధ్యతరహా ఐటీ కంపెనీల సంఘం చట్టసభ సభ్యులను కోరింది.దేశంలో నైపుణ్యంలో కలిగిన వర్క్‌ఫోర్స్ కొరతను పరిష్కరించడానికి తక్షణం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది.
‘‘ ITServe ’’ అని పిలిచే ఈ అసోసియేషన్‌లో 240 మందికి పైగా సభ్యులు వున్నారు.యూఎస్ క్యాపిటల్‌లో కాంగ్రెస్ న్యాయవాద దినోత్సవం సందర్భంగా తొలిసారిగా వ్యక్తిగతంగా వీరంతా సమావేశమయ్యారు.
అధిక నైపుణ్యం కలిగిన శ్రామికుల కొరత తమ వ్యాపారాలపై , అంతిమంగా అమెరికా ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ ITServe ’’ వాదన నేపథ్యంలో భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి( Raja Krishnamurthy ) మంగళవారం ‘‘ High-Skilled Immigration Reform for Employment (HIRE) Act ’’ను ప్రవేశపెట్టారు.ఈ చట్టం నైపుణ్యాల అంతరాన్ని పూడ్చటంలో సహాయం చేయడం ద్వారా యూఎస్ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుంది.అమెరికాలో ఎలిమెంటరీ, సెకండరీ స్కూల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (ఎస్టీఈఎం) విద్యా కార్యక్రమాలను బలోపేతం చేయడానికి అదనపు నిధులను అందిస్తుంది.
అలాగే హెచ్ 1 బీ వీసాల సంఖ్యను 65,000 నుంచి 1,30,000కు రెట్టింపు చేస్తుంది.
నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.ఏటా హెచ్-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.
వీటితో పాటు సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి ఏడాది పదివేల మంది ఉద్యోగులను నియమించుకోవడానికి టెక్ కంపెనీలకు హెచ్1బీ వీసాలే శరణ్యం.