సౌర శక్తి అంటే అందరికీ తెలిసిందే.సూర్యుడి కిరణాల నుండి వెలువడే శక్తి అని అర్ధం.
పరమాణు శక్తి తప్ప మానవుడు ఉపయోగించే మిగతా శక్తి అంతా సూర్యుని నుంచే వస్తుందని చదువుకున్న మీకు బాగా తెలుసు.ఈమధ్య కాలంలో ఈ సౌర శక్తి వినియోగం అంతటా పెరిగింది.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అద్భుత ఆవిష్కరణ చేశారు.సౌర శక్తితో విద్యుత్తును తయారుచేసే వస్త్రాన్ని తయారు చేసి ఆశ్చర్యాన్ని కలిగించారు.
ఆ వస్త్రంతో చొక్కా, ప్యాంటు కుట్టించుకొంటే మీ ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లను జేబులో పెట్టేసి చార్జింగ్ చేసుకోవచ్చన్నమాట.
దానికోసం వారు నూలు పోగుల మధ్య 1,200 సూక్ష్మ సోలార్ ప్యానెల్స్‌ను అమర్చి, వస్త్రాన్ని చాలా పొందికగా అల్లడం జరిగింది.
ఇంకా ఆ వస్త్రాన్ని ఎండలో ఉంచితే సరి.సౌర శక్తి దానంతట అదే గ్రహిస్తుంది.దాంతో 400 మిల్లీవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.ఈ విద్యుత్తు సెల్‌ఫోన్ చార్జింగ్‌కు సరిపోతుందని శాస్త్రవేత్తలు తాజాగా పేర్కొన్నారు.అలాగే ఈ వస్త్రాన్ని 40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఉతకొచ్చని చెప్పుకొచ్చారు.దీన్ని మరింత అభివృద్ధి చేసి జాకెట్లు, ఇతర వస్త్రాలను కూడా తయారు చేస్తామని వెల్లడించారు.

ఇక ఈ వస్త్రం విస్తీర్ణం వచ్చేసరికి 51 సెంటీమీటర్ల పొడవు, 27 సెంటమీటర్ల వెడల్పు కలిగి వుంది.ఇది నీటిలో తడిచినా పాడవకుండా అందులో ఒక్కో సోలార్ సెల్‌ను పాలిమర్ రెజిన్ కోటింగ్ చేసి వాటర్‌ప్రూఫ్‌గా పరిశోధకులు మార్చడం జరిగింది.ఒక్కో సోలార్ సెల్‌ను చిన్న వైరుతో అనుసంధానం చేసి తీగగా మార్చారు.రెండు నూలు పోగుల మధ్య సోలార్ సెల్ తీగను అమర్చుకొంటూ వస్త్రాన్ని తయారు చేశారు.