బుల్లితెర సీరియళ్ల ద్వారా, సినిమాల ద్వారా నటి రాగిణి మంచి పేరు, గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.బుల్లితెర సూపర్ హిట్ సీరియళ్లలో ఒకటైన అమృతం సీరియల్ లోని శాంత పాత్రను ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు.
అయితే ప్రస్తుతం పరిమితంగా సినిమాలు, సీరియళ్లలో రాగిణి నటిస్తున్నారు.దాదాపుగా 550 సీరియళ్లలో 190కు పైగా సినిమాలలో రాగిణి నటించారని సమాచారం.

మంచి కామెడీ టైమింగ్ ఉన్న రాగిణి వేమన సీరియల్ తో నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు.ప్రముఖ సీనియర్ నటీమణులలో ఒకరైన కృష్ణవేణికి రాగిణి చెల్లెలు కావడం గమనార్హం.చిన్న వయస్సులోనే డ్యాన్స్ నేర్చుకున్న రాగిణి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు.ఎండమావులు సీరియల్ లోని సీత పాత్ర రాగిణి పోషించిన మంచి పాత్రలలో ఒక పాత్రగా నిలిచింది.
ఒకవైపు టీవీ సీరియళ్లలో నటిస్తూనే సినిమా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ రాగిణి కెరీర్ ను కొనసాగించారు.ఈ మధ్య కాలంలో జులాయి, భలే భలే మగాడివోయ్ సినిమాలు రాగిణి కెరీర్ లో హిట్లుగా నిలిచాయి.
మొదట్లో సాఫ్ట్ రోల్స్ ను ఎక్కువగా ఎంచుకున్న రాగిణి ప్రస్తుతం కామెడీ టచ్ ఉన్న పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తుండటం గమనార్హం.కొన్ని సీరియళ్లలో రాగిణి లేడీ విలన్ పాత్రలు చేసి మెప్పించారు.

కెరీర్ తొలినాళ్లలో ఆర్థిక కష్టాలను అనుభవించిన రాగిణి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయారు.మన ప్రవర్తనను బట్టి ఇండస్ట్రీలో అవతలి వ్యక్తుల ప్రవర్తన ఉంటుందని తనకు మాత్రం సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురు కాలేదని రాగిణి అన్నారు.సినిమా రంగంలో టీవీ ఆర్టిస్టులు అంటే చిన్నచూపు అని పేమెంట్లు తక్కువగా ఇస్తారని రాగిణి చెప్పుకొచ్చారు.అయితే కొంతమంది నటులు ఆ ముద్రను చెరిపివేశారని ఆమె అన్నారు.