భారత సంతతికి చెందిన యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు , ప్రొగ్రెసివ్ డెమొక్రాట్ల సమూహానికి నేతృత్వం వహిస్తున్న ప్రమీలా జయపాల్( Pramila Jayapal ) ఇజ్రాయెల్‌కు క్షమాపణలు చెప్పారు.ఆ దేశాన్ని జాత్యహంకార రాజ్యంగా అభివర్ణిస్తూ జయపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై దుమారం రేగడంతో ఆమె ఇజ్రాయెల్‌కు క్షమాపణలు చెప్పారు.ఒక దేశంగా ఇజ్రాయెల్( Israel ) ఆలోచన జాత్యహంకారమని తాను నమ్మనని జయపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ( Benjamin Netanyahu )మితవాద ప్రభుత్వం వివక్షాపూరిత, పూర్తిగా జాత్యహంకార విధానాలలో నిమగ్నమైందని ప్రమీలా జయపాల్ వ్యాఖ్యానించారు.ప్రస్తుత ప్రభుత్వ నాయకత్వంలో ఆ విధానాన్ని నడిపిస్తున్న తీవ్ర జాత్యహంకారవాదులు వున్నారని తాను నమ్ముతున్నట్లు ఆమె అన్నారు.

మీడియా నివేదికల ప్రకారం.పాలస్తీనా అనుకూల నిరసనకారులు చికాగోలో జరిగిన ఒక సమావేశంలో చర్చకు అంతరాయం కలిగిస్తున్న సమయంలో ప్రమీల ఇజ్రాయెల్‌ను జాత్యహంకార దేశమంటూ వ్యాఖ్యానించారు.ఈ కామెంట్స్ పెద్ద దుమారం రేపడంతో హౌస్ డెమొక్రాటిక్ లీడర్ హకీమ్ జెఫ్రీస్( Hakeem Jeffries ), మరో ముగ్గురు నేతలు ప్రమీలాను మందలించారు.ఇజ్రాయెల్ జాత్యహంకార దేశం కాదన్నారు.
హౌస్ రిపబ్లికన్ చట్టసభ సభ్యులతో విభేదించినట్లే.ప్రస్తుత ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలోనూ విభిన్న సభ్యులు వున్నారని హకీమ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే ఈ ప్రకటనలో జయపాల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

యూఎస్ కాంగ్రెస్( US Congress ) ఉభయ సభల సమావేశంలో ప్రసంగించాల్సిందిగా యూఎస్ హౌస్ సెనేట్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌ను( Isaac Herzog ) ఆహ్వానించడంతో ఈ వివాదం తలెత్తింది.కాంగ్రెస్ ప్రొగ్రెసివ్ కాకస్‌కు చెందిన సభ్యులు కొందరు ఈ కార్యక్రమానికి హాజరుకాలేమని సంకేతాలిచ్చారు.ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వున్న వివాదం పరిష్కారానికి తాను చాలాకాలంగా మద్ధతు ఇస్తున్నానని ప్రమీలా జయపాల్ తెలిపారు.
వివాదాస్పద ప్రాంతాలలో ఇజ్రాయెల్ స్థిర నివాసాల విస్తరణకు మాత్రం తాను వ్యతిరేకమని ఆమె పేర్కొన్నారు.