గతంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా చైనీస్ అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది భారత కేంద్ర ప్రభుత్వం. ప్రముఖ చైనా యాప్స్ పై నిషేధం విధించి ఏడాదికి పైగా సమయం గడుస్తుంది.
ఈ నేపథ్యంలో భారతదేశం చైనా యాప్స్‌పై నిషేధాన్ని ఉపసంహరించుకుంటుందనే వార్తలు మొదలయ్యాయి.అయితే ఈ వార్తలన్నింటినీ పటాపంచలు చేస్తూ నిషేధాన్ని వెనక్కి తీసుకునే ఎలాంటి ప్రతిపాదన గానీ నిర్ణయం కానీ తీసుకోలేదని స్పష్టం చేసింది కేంద్రం.
బుధవారం లోక్‌సభలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చైనా యాప్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ యాప్స్ నిషేధాన్ని ఉపసంహరించుకునే ప్రతిపాదన లేదని ఓ లిఖితపూర్వక పత్రం అందించారు.దాంతో పబ్‌జీ, టిక్‌టాక్, విబో, వీచాట్, అలీఎక్స్‌ప్రెస్, యూసీ బ్రౌజర్ వంటి అప్లికేషన్లు ఇప్పట్లో ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది.
2020, జులై 29న 59 యాప్‌లు, సెప్టెంబర్ 2న మరో 118 యాప్‌లను, నవంబరులో 43 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.

ఐటీ చట్టంలోని సెక్షన్ 69-ఏ కింద బ్యాన్ విధించినట్లు అప్పట్లో ప్రభుత్వం వెల్లడించింది.ఈ నిర్ణయంతో చైనా దేశం చాలా నష్టపోయింది.ఎన్ని విధాలుగా అభ్యర్థన పెట్టుకున్నా భారత దేశం మాత్రం చైనీస్ అప్లికేషన్లను రెండో ఆలోచన లేకుండా బ్యాన్ చేసింది.

అయితే అప్లికేషన్ల బ్యాన్ విషయంలో ఖఠినంగా వ్యవహరించినప్పటికీ మిగతా విషయాల్లో మాత్రం కేంద్రం ఉదాసీనత కనబరుస్తోంది.ఇటీవల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఒప్పో ఇండియా తో కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకుంది.దాంతో చైనా కంపెనీతో ఒప్పందం ఏంటని నెటిజన్లతో పాటు రాజకీయ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
మొబైల్ లో ఒక రకమైన మెసేజ్ సర్వీస్ అందించేందుకు ఒప్పోతో డీల్ కుదుర్చుకున్నట్లు చేసిన ప్రకటన ఇప్పటికి విమర్శలకు దారి తీస్తూనే ఉంది.