దక్షిణాఫ్రికా ప్రయత్నాలు ఇన్నాళ్లకు ఫలించాయి.తమ అవినీతితో దేశాన్ని దోచుకుని.
కుటుంబాలతో సహా పారిపోయిన భారత సంతతికి చెందిన గుప్తా బ్రదర్స్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు.యూఏఈలో వీరిని అరెస్ట్ చేసినట్లు దక్షిణాఫ్రికా ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ముగ్గురు సోదరుల్లో రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తాను అదుపులోకి తీసుకోగా.మరో సోదరుడు అజయ్ గుప్తా అరెస్ట్‌కు సంబంధించి క్లారిటీ రావాల్సి వుంది.
కాగా.నాటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సాన్నిహిత్యం ద్వారా అజయ్, అతుల్, రాజేశ్‌లు బిలియన్ డాలర్ల విలువైన అక్రమాలకు పాల్పడ్డారని ఎన్‌పీఏ దర్యాప్తులో తేలింది.
జుమా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గుప్తా బ్రదర్స్ రాజకీయాల్లోనూ తమ హవా కొనసాగించారు.అధ్యక్షుడితో సత్సంబంధాలు పెంచుకున్న వీరు కేబినెట్‌లో ఎవరు ఉండాలి? ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి? అన్న విషయాలను కూడా శాసించే స్థాయికి చేరుకున్నారు.
కానీ పాపం పండక తప్పదన్నట్లు.ఓ మిలటరీ స్థావరం వద్ద గుప్తా బ్రదర్స్ నిర్వహించిన వివాహ వేడుక వారి పతనానికి బీజాలు వేసింది.ఇందుకు గాను భారత్ నుంచి ప్రత్యేక విమానాల్లో బంధుమిత్రుల్ని తీసుకొచ్చారు.దీంతో దేశంలోని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మీడియా గుప్తా బ్రదర్స్ అవినీతిని, జుమాను టార్గెట్ చేయడం మొదలెట్టాయి.
అటు దర్యాప్తు సంస్థలు తమ పని మొదలెట్టాయి.ఈ క్రమంలోనే వీరి అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి రావడం ప్రారంభమైంది.
జొహెన్నెస్‌బర్గ్ స్టాక్ ఎక్సేంజీ నుంచి గుప్తా బ్రదర్స్ కంపెనీలను డీలిస్ట్ చేశారు.దీంతో కనీసం ఉద్యోగులకు జీతాలివ్వలేని స్థితిలోకి గుప్తా కంపెనీలు చేరుకున్నాయి.
అటు సొంత పార్టీతో పాటు విపక్షాలు సైతం తనను లక్ష్యంగా చేసుకోవడాన్ని గుర్తించిన జుమా 2018లో దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.కేసులు, అరెస్ట్‌ల భయంతో గుప్తా బ్రదర్స్ యూఏఈలో తలదాచుకున్నారు.
అప్పటి నుంచి వారిని దక్షిణాఫ్రికాకు రప్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
గుప్తా బ్రదర్స్‌ది యూపీలోని షహరాన్‌పూర్.స్థానిక రాణి బజార్‌లో వీరి తండ్రి శివకుమార్‌కు రేషన్ షాపు ఉండేది.వీరిని స్థానికులు ఇప్పటికీ ‘రేషన్ షాపోళ్లు’ గానే పిలుస్తుంటారు.
తండ్రి స్మారకార్థం ఓ దేవాలయాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా ఇక్కడి శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతారు.మొత్తంగా గుప్తా సోదరులు దాదాపు 15 బిలియన్ రాండ్ల (భారత కరెన్సీలో రూ.7,513 కోట్లు) అవినీతికి పాల్పడినట్లు దక్షిణాఫ్రికా దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది
.