గత మంగళవారం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఉవాల్డీ ప్రాంతంలోని రాబ్ ప్రాథమిక పాఠశాలలో దుండగుడు జరిపిన కాల్పుల్లో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.అనంతరం పోలీసుల కాల్పుల్లో నిందితుడు రామోస్ సాల్వడార్ కూడా హతమయ్యాడు.
దీనిపై అతని తల్లి అడ్రియానా మార్టినెజ్ స్పందించారు.తన కుమారుడిని, తనను క్షమించాలని ఆమె కోరారు.
టెలివిసాకు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఉద్వేగానికి గురయ్యారు.తనను, తన బిడ్డను క్షమించాలంటూ కంటతడి పెట్టారు.అతను చేసిన పనికి కారణాలు వున్నాయని తనకు తెలుసునని అడ్రియానా వ్యాఖ్యానించారు.అతనికున్న కారణాలేంటీ అని ప్రశ్నించగా.
పిల్లలతో సన్నిహితంగా వుండటానికి బదులు, చెడు విషయాలపై దృష్టిపెట్టాడంటూ ఆమె అన్నారు.
అటు డైలీ బీస్ట్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రామోస్ తండ్రి మాట్లాడుతూ.తన కొడుకు చేసిన పనికి తనను క్షమించాలని, అతను ఇలాంటి పని చేస్తాడని ఊహించలేదని అన్నాడు.తన కుమారుడు ఎవరినో చంపే బదులు తనను చంపి వుండాల్సిందని వ్యాఖ్యానించాడు.
కాల్పులు జరిగిన సమయంలో రామోస్ తండ్రి రోజువారి పనిలో వున్నాడు.ఈ విషయం తెలుసుకున్న అడ్రియానా వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది.
దీంతో తాను స్థానిక జైలుకు ఫోన్ చేశానని.కానీ అప్పటికే పోలీసులు తన కుమారుడిని చంపేశారంటూ ఉద్వేగానికి గురయ్యారు.
తాను జీవితంలో మళ్లీ తన కుమారుడిని చూడలేనని.అది తనను ఎప్పటికీ బాధపెడుతూనే వుంటుందని ఆయన కంటతడిపెట్టారు.
ఇకపోతే.పాఠశాలలో నరమేధం సృష్టించడానికి ముందు రామోస్ తన నానమ్మపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.దీనిపై రామోస్ తాతయ్య మీడియాతో మాట్లాడుతూ.ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, ఒకవేళ అక్కడే వుండి వుంటే అతను తనను కూడా చంపేవాడని అభిప్రాయపడ్డారు.
ఆయుధాలు కలిగి వుండటం రాదని, అతని పనికి తాను వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పిల్లలు తన స్నేహితుల మనుమలేనని ఆవేదన వ్యక్తం చేశారు.