వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.లారీ, కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లారీ, కారు ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండలో ఈ రోజు తెల్లవారుజామున చోటు చేసుకుంది.
కారును లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పరకాల ఏసీపీ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీశారు.
కారు మొత్తం నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి సమయం పట్టింది.మృతులు వరంగల్ జిల్లా పోచం మైదాన్ కు చెందిన వారని.వీరి పేర్లు మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబీర్, పవన్ అని పోలీసులు నిర్ధారించారు.చనిపోయిన వారి కుటుంబాలకు సమాచారం అందించి మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.