ప్రత్యర్ధుల ఎత్తులకు పై ఎత్తులు వేయడం, ప్రజల నాడీని గమనించి అందుకు అనుగుణంగా వ్యాపారంలో మార్పులు తీసుకురావడం వ్యాపారవేత్త లక్షణాలు.ఇక అన్నింటి కంటే ముఖ్యంగా ముందుచూపు వున్న బిజినెస్‌మెన్‌ను ఎవరూ అడ్డుకోలేరని చరిత్ర చెబుతోంది.
ఎన్ని తెలివితేటలు వున్నా దూరదృష్టి లేక వ్యాపారాలు దెబ్బతిని చరిత్రలో కలిసిపోయిన వ్యాపారవేత్తలు ఎందరో వున్నారు.ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే.
గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై అన్ని దేశాల మీడియాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.
వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో జరిపేది మూడో రోదసి యాత్ర.
నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.
భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.
ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్ రోదసి యాత్రల్లో ముందున్నా .ఎలన్ మస్క్ సారథ్యంలోని స్పేస్ ఎక్స్ ఏకంగా నాసాతో సమాంతరంగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తూ దూసుకెళ్తోంది.అంతరిక్ష పర్యాటకంలో పోటీని గ్రహించిన ఎలన్ మస్క్ దూరదృష్టితో ఆలోచించారు.
అదే స్పేస్‌లో అడ్వర్టైజింగ్.దీనిలో భాగంగా ఏకంగా అంతరిక్షంలో అడ్వర్టైజ్ బిల్ బోర్డ్లను ఏర్పాటుచేయనుంది.
కెనడాకు చెందిన స్టార్టప్ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పోరేషన్ (జీఈసీ) భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్ అనే ఉపగ్రహాన్ని స్పేస్ ఎక్స్ అంతరిక్షంలోకి ప్రయోగించనుంది.ఈ ఉపగ్రహంతో ఆయా కంపెనీలు లోగోల గురించి లేదా అడ్వర్టైజ్మెంట్లను అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేయడం ఈ ప్రయోగం ముఖ్యోద్దేశం.
క్యూబ్‌శాట్ శాటిలైట్ చూపించే అడ్వర్టైజ్మెంట్లను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు.అందుకోసం క్యూబ్‌సాట్‌కు సపరేటుగా సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటుచేసినట్లుగా తెలుస్తోంది.ఈ శాటిలైట్‌ను ఫాల్కన్-9 రాకెట్ ద్వారా త్వరలోనే స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది.ఈ సందర్భంగా జీఈసీ స్టార్టప్ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ మాట్లాడుతూ.
అంతరిక్షంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనే కంపెనీలు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు.క్యూబ్‌శాట్ ఉపగ్రహంతో అడ్వర్టైజింగ్ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు శామ్యూల్ ఆశాభావం వ్యక్తం చేశారు.