2019 సంవత్సరం డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో విజృంభించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెంది ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కొత్త కష్టాలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలు చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
చైనా ముందే హెచ్చరించి ఉంటే తమ దేశాల్లో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పలు దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
అయితే తాజాగా చైనా భారత్ నుంచే కరోనా వైరస్ వచ్చి ఉండవచ్చంటూ వివాదాస్పద ఆరోపణలు చేసింది.
గతంలో పలు దేశాలపై ఈ తరహా ఆరోపణలు చేసిన డ్రాగన్ ప్రస్తుతం భారత్ పైనే విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. చైనా మీడియాలో భారత్ కరోనాకు కారణం కావచ్చంటూ నిరాధార వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఇతర దేశాల ఆహారోత్పత్తుల నుంచి చైనాకు వైరస్ వచ్చి ఉండవచ్చని చైనా మీడియా చెబుతోంది.

తమ దేశంలో మొదట ఎక్కువ కేసులు నమోదయ్యాయని అంత మాత్రాన తమ దేశందే తప్పు అని ఆరోపణలు చేయడం సరికాదని చైనా చెబుతోంది.భారత్ నుంచి వచ్చిన ఒక చేపల కంటైన్మెంట్ లో కూడా కరోనా వైరస్ జాడలు గుర్తించామని చైనా చెబుతోంది.డబ్ల్యూహెచ్‌వో కరోనా వైరస్ పుట్టుక గురించి అధ్యయనాలు చేస్తున్న సమయంలో చైనా ఈ తరహా ఆరోపణలు చేయడం గమనార్హం.
త్వరలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణ మొదలుపెడుతున్న సమయంలో విచారణను తప్పుదోవ పట్టించేందుకే చైనా ఈ తరహా ఆరోపణలు చేస్తోందని కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు 2021 ఏప్రిల్ నాటికి కరోనాకు పది రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.