ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జారిపోయారు.ఆ పార్టీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన వారిలో వల్లభనేని వంశీ మోహన్ – కరణం బలరాం – మద్దాలి గిరిధర్ రావు – వాసుపల్లి గణేష్ ఈ నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ దిగేసి ఫ్యాన్ కింద సేద తీరేందుకు వెళ్లిపోయారు.
ఈ నాలుగు నియోజకవర్గాల్లో మూడు చోట్ల కొత్త నేతలకు చంద్రబాబు పార్టీ పగ్గాలు ఇచ్చారు.చీరాలలో యడం బాలాజీ, గన్నవరంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడు, గుంటూరు వెస్ట్‌లో కోవెలమూవీ రవీంద్రకు పార్టీ పగ్గాలు ఇచ్చారు.
అయితే విశాఖ దక్షిణంలో మాత్రం కొత్త నేత అంటూ ఎవ్వరూ లేరు.
వాసుపల్లి గణేష్ కుమార్ దశాబ్దంన్నర కాలంగా అక్కడ పాతుకుపోయారు.
సౌత్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూనే ఉన్నారు.ఆయన చాలా క్రమశిక్షణతో ఉండేవారు.
నగర పార్టీ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తూ పార్టీ నేతలను సమన్వయం చేసుకునేవారు.ఏ విషయంలో అయినా ఎవ్వరి దగ్గరా తలవంచేవారు కాదు.
ఇప్పుడు ఆయన బయటకు వెళ్లిపోవడంతో అక్కడ వాసుపల్లికి ధీటైన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో చంద్రబాబు తీవ్రంగా సతమతమవుతున్నారు.

వాసుపల్లి అక్కడ దశాబ్దంన్నర కాలంగా టీడీపీలో రాజకీయం చేసినా ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవ్వరూ ఎదగకుండా జాగ్రత్త పడ్డారు.ఆయన మిలట్రీ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో తనకంటూ ప్రత్యేకంగా ఓ వర్గం ఏర్పాటు చేసుకున్నారు.ఇప్పుడు ఆయన వైసీపీలోకి వెళ్లిపోగానే ఆ గ్యాంగ్ అంతా ఆయనతోనే వెళ్లిపోయింది.
దీంతో ఇప్పుడు సౌత్ నియోజకవర్గంలో టీడీపీ దిక్కూ మొక్కూ లేకుండా పోయింది.
కాంగ్రెస్‌కు గతంలో కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వాసుపల్లి వరుసగా రెండుసార్లు విజయం సాధించడం అంటే ఆయన వ్యక్తిగత ఛరిష్మా కూడా ఉందనే చెప్పాలి.
ఏదేమైనా వాసుపల్లి బయటకు వెళ్లాక కాని.ఆయన ఎలాంటి స్ట్రాంగ్ ఎమ్మెల్యేనో చంద్రబాబుకు తెలియరాలేదన్న కామెంట్లు టీడీపీలో వినిపిస్తున్నాయి.