పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయిన వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్( CM ys jagan ) దానికి అనుగుణంగా నే వ్యూహాలు రచిస్తున్నారు.ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో ,పూర్తిగా ప్రజాబలం పెంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
జనసేన, టిడిపి ఉమ్మడిగా తమను ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ,ఒంటరిగానే ఎన్నికల్లో పోటీచేసి గెలవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు.వై నాట్ 175 అనే నినాదాన్ని పార్టీ శ్రేణుల్లోకి తీసుకువెళ్లి వారిలో గెలుపు పై మరింత పట్టుదల పెంచాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు .దీనిలో భాగంగానే ఇక పూర్తిగా జనాల్లో ఉండేందుకు జగన్ నిర్ణయించుకున్నారు.జగన్ ఎక్కువగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితం అవుతుండడంపై విపక్షాలు సెటైర్లు వేయడం, సొంత పార్టీ నేతలలోను ఈ విషయంలో అసంతృప్తి ఉండడం, జగన్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇతర నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వరు అనే ప్రచారం ఉధృతమైన నేపథ్యంలో, జనాల్లోనే ఉండి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలనే వ్యూహం తో జగన్ ఉన్నారు .

మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి చెందడానికి కారణం కేసీఆర్ వైఖరే( KCR ) అని , ఆయన పార్టీ నాయకులకు , మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎవరికి అందుబాటులో ఉండకపోవడం, ఎవరికి అపాయింట్మెంట్లు ఖరారు చేయకపోవడం, జనాల్లోకి అప్పుడప్పుడు మాత్రమే రావడం ఇవన్నీ ఆ ఎన్నికల్లో ప్రభావం చూపించాయి.బీఆర్ఎస్ ఓటమికీ కారణాలు అయ్యాయి.దీంతో కెసిఆర్ చేసిన తప్పును తాను చేయకూడదని భావిస్తున్న జగన్, జనాల్లో ఉండే విధంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఏపీ అంతటా చేపట్టిన పాదయాత్ర కు జనాల నుంచి విశేష స్పందన రావడంతోనే 151 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందింది.
మళ్లీ అదే ఉత్సాహం జనాల్లో ఉండే విధంగా, మొన్నటి ఎన్నిక ఫలితాలకు ఏ మాత్రం తగ్గకుండా సీట్లు సాధించాలని జగన్ భావిస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం ఫైనల్ లిస్ట్ ను జనవరి 10 లోపు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక జనాల్లోకి తాను వచ్చి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఎంత మేలు జరిగింది అనేది వివరించడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే మరింతగా ప్రజలకు లబ్ధి చేకూరుస్తాము అనే విషయాన్ని జగన్ స్వయంగానే జనాలకు చెప్పబోతున్నారట.
ఎక్కడా విపక్షాలకు అవకాశం లేకుండా , ఎన్నికల ఫలితాలు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా ఉండే విధంగా జనాల్లో ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.