ఎవరి ఇంట్లోనైనా విపరీతంగా ఎలుకలు ఉంటే ఏం చేస్తారు? బోను లేదా ఎలుకల మందులను ఉపయోగించి వాటిని అంతం చేస్తారు.తద్వారా వాటి బెడద తప్పుతుందని అనుకుంటారు.
ఈ బోనులకు బదులుగా ఉపయోగించే జిగురు ప్యాడ్స్ (గ్లూట్రాప్) ఉపయోగం ఇటీవల కాలంలో బాగానే పెరిగింది.అయితే, తాజాగా వాటిని తెలంగాణ సర్కారు నిషేధించింది.
ఎందుకో తెలుసా? ఈ గ్లూ ట్రాప్స్ వినియోగం వల్ల మూగ జీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్’ (పెటా) తెలంగాణ సర్కారుకు తెలిపింది.దాంతో ప్రభుత్వం గ్లూట్రాప్‌ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించింది.
గ్లూట్రాప్స్‌తో ర్యాట్స్‌ను బంధించడం అత్యంత క్రూరమైన విధానమని, ఎలుకలు వాటికి అతుక్కుపోయి తీవ్రనొప్పి, బాధను ఎదుర్కొంటాయని, ఈ నేపథ్యంలోనే గ్లూట్రాప్‌ల వినియోగం జంతువులపై క్రూరత్వం నిషేధ చట్టం– 1960లోని సెక్షన్ 11 స్ఫూర్తికి విరుద్ధమని ప్రభుత్వం పేర్కొంది.ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది.
నిషేధాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆఫీసర్స్‌ను ఆదేశించింది.ఇలాంటి గ్లూ ప్యాడ్స్‌లో ఎలుకలతో పాటు ఇతర జంతువులూ ఇరుక్కుపోయి చాలా కాలం పాటు ఆకలి, నీరు అందక చనిపోతున్నాయని వివరించింది.
ఈ గ్లూలో ఇరుక్కుపోయి తప్పించుకోవడానికిగాను యానిమల్స్ వాటి బాడీ పార్ట్స్‌ను అవే కొరుక్కుంటూ మరణిస్తున్నట్లుగా పెటా ఇండియా పేర్కొంది.ఈ క్రమంలోనే ఎలుకల బెడదను తప్పించుకోవడానికి వాటిని ట్రాప్ చేసి డబ్బాలో పడేయడంతో పాటు ఇతర సంప్రదాయ పద్ధతుల్లో ర్యాట్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పెటా ఇండియా ప్రజలకు తెలిపింది.
ఇకపోతే తెలంగాణ సర్కారు గ్లూట్రాప్‌లను నిషేధిస్తూ ప్రకటన చేయడంపై ‘పెటా’ హర్షం వ్యక్తం చేసింది.ర్యాట్స్ నిర్మూలనకు జనాలు సంప్రదాయ పద్ధతులను ఫాలో కావాలని ఈ క్రమంలోనే ‘పెటా’ సూచించింది.