ఉన్నపళంగా విమాన సర్వీసు రద్దు కావడంతో ఎన్ఆర్ఐ దంపతులకు కలిగిన అసౌకర్యానికి గాను నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కన్జ్యూమర్ కోర్ట్ భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ఆదేశించింది.వడోదరాకు చెందిన ఇంద్రవన్, ఇలా అమిన్ అనే వృద్ధ దంపతులు అమెరికాలో ని ఆస్టిన్ నగరంలో స్థిరపడ్డారు.2012 మే 21న దంపతులు అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు గాను ఎయిరిండియా విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు.
అయితే సరిగ్గా అదే సమయంలో పైలట్లు సమ్మెలో ఉన్నందున నెవార్క్ ఎయిర్‌పోర్టులో ఈ జంటతో పాటు ఇతర ప్రయాణికులను విమానాశ్రయంలోని మోటెల్‌కు పంపారు.
అప్పటికే అది నిండిపోవడంతో వీరిని మరో మోటెల్‌కు తరలించారు.సుమారు నాలుగు గంటల నిరీక్షణ తర్వాత వారు న్యూఢిల్లీకి వెళ్లాల్సిందిగా ఎయిర్‌లైన్స్ నుంచి కాల్ వచ్చింది.దీంతో ఈ జంట మే 23 ఉదయం వరకు న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఎదురుచూశారు.అనంతరం అక్కడ నుంచి అహ్మదాబాద్ వెళ్లే విమానానికి అధికారులు పాసులు ఇచ్చారు.
ఎయిర్‌లైన్స్ సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయని కారణంగా తాము అనవసరమైన సౌకర్యానికి గురయ్యామని.దీనితో పాటు యూఎస్ఏలో మోటెల్‌కు వెళ్లేందుకు లగేజీ మోసుకుంటూ ప్రయాణించాల్సి వచ్చిందని ఈ జంట అహ్మదాబాద్‌లోని వినియోగదారుల వివాద పరిష్కార ఫోరంలో కేసు వేశారు.
ఈ సమయంలో తమకు సిబ్బంది కనీసం గ్లాసు మంచినీరు కూడా ఇవ్వలేదని.ఢిల్లీలో సైతం గంటల తరబడి ఆలస్యమైందని పిటిషన్లో పేర్కొన్నారు.
విచారణలో భాగంగా వృద్ధ దంపతులు అసౌకర్యానికి గురయ్యారని తేల్చిన కోర్టు ఎయిరిండియాపై మండిపడింది.నెవార్క్, న్యూఢిల్లీ రెండు విమానాశ్రయాల్లోనూ అసౌకర్యం కారణంగా ప్రయాణీకులతో స్నేహపూర్వకంగా వ్యవహరించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇందుకు గాను దంపతులిద్దరికి చెరో రూ.15,000 దానిపై 9 శాతం వడ్డీని కలిపి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోర్టు ఎయిరిండియాను ఆదేశించింది.కాగా ఈ వృద్ధ జంట తమకు కలిగిన అసౌకర్యానికి గాను రూ.2.51 లక్షలు పరిహారంగా డిమాండ్ చేశారు.
.